Allu Arjun: మిగిలిన హీరోలందరూ ఆ సక్సెస్‌ని ఎప్పుడో ఎంజాయ్ చేశారని, కానీ తనకు మాత్రం చాలా ఏళ్లు పట్టిందని అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో విడుదలై ఏడాదైన విషయం తెలిసిందే. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో నాన్ బాహుబలి రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. ఇక ఈ మూవీతో బన్నీ-త్రివిక్రమ్ జోడీ హ్యాట్రిక్‌ని కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూవీ విడుదలై ఏడాదైన సందర్భంగా అల టీమ్ మళ్లీ సెలబ్రేషన్స్‌ని చేసుకున్నారు. రీయూనియన్ పేరిట సోమవారం జరిగిన ఓ వేడుకలో ఈ మూవీ దర్శకుడు, నిర్మాతలలో పాటు ఇందులో అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నిజానికి చెప్పాలంటే గత ఏడాది ప్రపంచం మొత్తానికి చాలా బాధను ఇచ్చింది. కానీ నేను మాత్రం 2020 గురించి అస్సలు కంప్లైంట్ చేయను. ఎందుకంటే నాకు ఆ సంవత్సరం మరిచిపోలేనిది. అల వైకుంఠపురములో రిలీజై నా మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరికను నెరవేర్చింది. ఈ మూవీని గతేడాది సంక్రాంతికి విడుదల చేయకుండా.. సమ్మర్లో అనుకొని ఉంటే నేను ఈ సంతోషాన్ని చాలా మిస్ అయ్యేవాడిని. సంక్రాంతికి విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మా సినిమా గురించి ఏదో ఒక చోట మాట్లాడుకుంటూనే ఉన్నారు. అది నాకు సంతోషాన్ని ఇచ్చింది. లాక్డౌన్లో ఇంటిపట్టున ఉన్నప్పటికీ.. నాకు ఈ సక్సెస్ చాలా బూస్టప్‌ని ఇచ్చింది. నిజంగా నాకు 2020 మరిచిపోలేని సంవత్సరం అని బన్నీ అన్నారు.
ఇక మిగిలిన హీరోలందరూ తమ కెరీర్లో ఆల్‌టైమ్ హిట్‌ని ప్రారంభంలోనే ఎంజాయ్ చేశారని బన్నీ అన్నారు. పవన్ కల్యాణ్‌కు ఖుషీతో ఆల్‌టైమ్ హిట్ వచ్చింది, తారక్ సింహాద్రితో పెద్ద విజయం అందుకున్నాడు, చెర్రీకి రెండో చిత్రం మగధీరతోనే పెద్ద విజయాన్ని ఎంజాయ్ చేశారు, కానీ నాకు అలాంటి హిట్ ఎప్పుడు వస్తుందా అని ఇన్నేళ్లుగా ఎదురుచూశా. అల వైకుంఠపురములో నా కోరికను నెరవేర్చింది. ఈ మూవీ కోసం పనిచేసిన అందరికీ నిజంగా కృతఙ్ఞుడై ఉంటాను అని బన్నీ తెలిపారు.
కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ఫలో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ముత్తంశెట్టి క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Trivikram Srinivas