నేటి ఉరుకులు పరుగుల జీవితంలో అనేక మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. ఫలితంగా వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఇంటి పని, ఆఫీసు పనుల్లో నిమగ్నమై వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడికి లోనవ్వడం, కంటి నిండా నిద్రపోకపోవడంతో ఎముకల సాంద్రత దెబ్బతింటుంది. దీంతో చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే, అటువంటి వారికి భవిష్యత్తులో వినికిడి లోపం (చెవుడు) కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిఘం, ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. దాదాపు 1,44,000 మంది మహిళల నుంచి సేకరించిన డేటా విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయనంలో తేలిన ఫలితాలు అమెరికన్ గెరియాట్రిక్ సొసైటీ జర్నల్లో ప్రచురించారు.
తక్కువ బోన్ డెన్సిటీతో బాధపడుతున్న 40 శాతం మందిలో ఈ వినికిడి సమస్య కనుగొన్నామని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈ వినికిడి లోపం అనేది అమెరికాలో మూడో అత్యంత సాధారణ దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితిగా పేర్కొన్నారు. ఈ వినికిడి లోపాన్ని ప్రారంభంలోనే గుర్తించాలని, లేదంటే కోలుకోలేని ప్రమాదానికి కారణమవుతుందని తెలిపారు. ఈ అధ్యయనానికి బ్రిఘంలోని చాన్నింగ్ డివిజన్ ఆఫ్ నెట్వర్క్ మెడిసిన్ ఎండీ షారన్ కుర్హాన్ నాయకత్వం వహించారు. ఎముకల సాంద్రత తగ్గిన వ్యక్తులలో పగుళ్లను నివారించడానికి బిస్ఫాస్ఫోనేట్స్ అనే మందు ఉపయోగపడుతుందని ప్రాధమికంగా తేల్చారు.
దీనిపై షారన్ మాట్లాడుతూ ‘‘ఎలుకల్లో వినికిడి లోపాన్ని నిరోధించడానికి ఉపయోగించే ఈ బిస్ఫాస్ఫోనేట్లు మనుషుల్లో కూడా వినికిడి లోపానికి తీర్చేందుకు సహాయపడతాయని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. అందువల్ల, బిస్ఫాస్ఫోనేట్లు వినికిడి నష్టానికి పరిష్కారం చూపిస్తాయా? లేదా? అనే దానిపై మా తదుపరి పరిశోధన కొనసాగుతుంది. ఎముకల సాంద్రత తగ్గడానికి, వినికిడి లోపానికి గల సంబంధంపై ఇంకా అధ్యయనం జరగాల్సి ఉంది" అని ఆయన చెప్పారు.
1,44,000 మందిపై అధ్యయనం..
పరిశోధన కోసం 1,44,000 మంది మహిళల్లో వ్యాధులకు సంబంధించిన డేటాను పరిశీలించారు. దీని కోసం NHS, NHS II నుంచి డేటాను సేకరించారు. వెన్నెముక, ఇతర ఎముకల్లోని సాంద్రత తగ్గడం క్రమంగా లోపలి చెవి చుట్టూ ఉన్న ఎముకలో వినికిడి నష్టానికి దోహదం చేస్తుందని ఈ డేటా విశ్లేషణ ద్వారా ప్రాధమికంగా తేల్చారు. అయితే, ఇది వృద్ధాప్యంలో వచ్చే సాధారణ వినికిడి లోపమా? లేదంటే ఎముకల్లో డెన్సీటీ తగ్గడమే దీనికి కారణమా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాల్షియం, విటమిన్ డి, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, శారీరకంగా చురుకుగా ఉండటం వంటి జాగ్రత్తల ద్వారా ఈ బోన్ డెన్సిటీ దెబ్బతినడం నుంచి బయటపడొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. జీవితకాలం ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం ద్వారా భవిష్యత్తులో ఎముకలు, వినికిడి లోపాన్ని అధిగమించవచ్చని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Women