ఇప్పుడు మెగా డాటర్ నిహారిక పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కానీ.. మెగా ఫ్యామిలీకి మూలమైన చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వచ్చారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ప్రముఖ సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య తన కుమార్తెసురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన వేళా విశేషమో ఏమో కానీ.. క్రమంగా చిరంజీవికి ఎక్కువ సినిమాలు రావడం.. క్రమంగా ఆయన హీరోగా నిలదొక్కుకోవడం జరిగాయి. అయితే చిరంజీవి పెళ్లి ఎలా జరిగింది. అనే దానిపై ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. అదేంటంటే..
కెరీర్ ప్రారంభంలో ‘మన వూరి పాండవులు’ సినిమాలో చిరంజీవి ఐదుగురు కుర్రాళ్లలో ఒకరిగా నటించాడు. ఆ సినిమాలో విలన్ రావుగోపాలరావు మేనల్లుడు పాత్రలో చిరంజీవి నటిస్తే.. విలన్ అసిస్టెంట్ కనెక్షన్ కనకయ్య పాత్రలో అల్లు రామలింగయ్య నటించారు. ఆ సినిమాలో చిరంజీవి నటనను బాగా గమనించిన అల్లు రామలింగయ్య, తన గుణగణాలను కూడా గమనించ సాగారు. ఎందుకంటే తొలి పరిచయంలోనే చిరంజీవి ఆయనకుమంచి అభిప్రాయం ఏర్పడింది. తన కుమార్తె సురేఖను ఇచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది కదా, అనే ఆలోచన వచ్చింది. దాంతో చిరంజీవిని దగ్గరగా గమనించసాగారు రామలింగయ్య. ఉదాహరణకు ఓ సందర్భంలో రామలింగయ్య మందుతాగుతూ నువ్వు కూడా తీర్థం పుచ్చుకోవచ్చు కదయ్యా అన్నారట. దానికి చిరంజీవి నాకలాంటి అలవాట్లు లేవండి.. నేను ఆంజనేయ స్వామి భక్తుడ్ని అని చిరంజీవి చెబితే రామలింగయ్య నవ్వుకున్నాడట.
అలాగే అల్లు రామలింగయ్య ఇంట్లో మిత్రుడు సత్యనారాయణని కలుసుకోవడానికి అప్పుడప్పుడు చిరంజీవి వాళ్లింటికి వెళుతుండేవాడట. అప్పుడు చిరంజీవిని గమనించిన అల్లు రామలింగయ్య భార్య ఈ కుర్రాడెవరో బుద్ధిమంతుడిగా కనిపిస్తున్నాడు. మనమ్మాయికి ఎలాగూ సంబంధాలు చూస్తున్నాం కదా.. అని అల్లు రామలింగయ్యకి చెప్పిందట. ఆయన కూడా నేను అదే అనుకుంటున్నానని చెప్పి, సత్యనారాయణను పిలిచి చిరంజీవి గురించి అడిగితే తను కూడా చిరంజీవి గురించి మంచిగానే చెప్పాడట. తర్వాత రామలింగయ్య.. కొడుకు అరవింద్‌ను పిలిచి విషయం చెప్పిఇతర విషయాలు కనుక్కోమని చెప్పారట.
చిరంజీవికి, అల్లు రామలింగయ్యకి కామన్ ఫ్రెండ్ అయిన జయకృష్ణగారిని అరవింద్ కలుసుకుని అసలు విషయం చెప్పాడట. అప్పుడు జయకృష్ణ సరేనని చెప్పి, రెండు కుటుంబాల వారిని పిలిచి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడట. అయితే చిరంజీవి పెళ్లి చూపులకు నేనెందుకు రావడం మీరు చూడండి చాలు అని అన్నాడట. దానికి చిరంజీవి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా చిరంజీవిని కూడా తీసుకెళ్లారట. అయితే సురేఖ చిరంజీవిని.. మనవూరి పాండవులు ప్రివ్యూ వేసినప్పుడు, తయారమ్మ బంగారయ్య శతదినోత్సవ వేడుకల్లో చూసి ఉండటంతో.. ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి జరిగిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Chiranjeevi Wife Surekha, Mega Family, Megastar Chiranjeevi