SP Balasubrahmanyam | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్ప గాయకుడో... అంత కన్నా నటుడిగా, నిర్మాతగా టీవీ వ్యాఖ్యాతగా సినీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాలు గురించి సెపెరేట్‌గా చెప్పాలి. వివిధ భాషల్లో గాయకుడిగా తీరిక లేని సమయంలో కూడా బాల సుబ్రహ్మణ్యం తనదైన విలక్షణ డబ్బింగ్‌తో ప్రేక్షకుల మన్నన అందుకున్నారు. మొదటిసారి బాలు.. కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన తెలుగు డబ్బింగ్ చిత్రం ‘మన్మథ లీల’ చిత్రంలో కమల్ హాసన్‌ను డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత 1981లో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాలుగు స్థంభాలాట’ సినిమాలో హీరో నరేష్‌కు డబ్బింగ్ చెప్పారు. ఇక 1982లో రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాంధీ’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో గాంధీజీ పాత్రకు తన డబ్బింగ్‌తో ప్రాణం పోసారు ఎస్పీ బాలు.ఇక జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆనంద భైరవి’లో గిరీష్ కర్నాడ్‌కు డబ్బింగ్ చెప్పారు. ఇక 1985లో తెలుగులో కే.విశ్వనాథ్ దర్వకత్వంలో తెరకెక్కిన ‘స్వాతి ముత్యం’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ‘‘సిప్పకల్ ముత్తు’ సినిమాలో కమల్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
అటు సాగర సంగమం సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్‌కు బాలు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన ఎన్నో తెలుగు డబ్బింగ్ చిత్రాలైన ‘భారతీయుడు’, ‘భామనే సత్యభామనే’,‘మన్మథ బాణం’అభయ్.‘సత్యమే శివం’ వంటి పలు చిత్రాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. ఇక కమల్ హాసన్, నటించిన దశావతారం’ సినిమాలో పది పాత్రల్లో ఏడు పాత్రలకు ఎస్పీ బాలు డబ్బింగ్ చెప్పడం విశేషం.మొత్తంగా కమల్ హాసన్‌తో బాలుది ప్రత్యేక అనుబంధం అనే చెప్పాలి.
కమల్ హాసన్ కాకుండా .. రజినీకాంత్ సినిమా అంటే తెలుగులో మనో (నాగూర్ బాబు) డబ్బింగ్ ఉండాల్సిందే. అంతకు ముందు రజినీకాంత్ పలు చిత్రాలకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. కానీ రజినీకాంత్ నటించిన ‘కథానాయకుడు’ సినిమాలో రజినీ పాత్రకు బాలు డబ్బింగ్ చెప్పారు. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీరామరాజ్యం’ తమిళ డబ్బింగ్ వెర్షన్‌కు బాలు డబ్బింగ్ చెప్పారు.
ఇక హీరోలకే కాకుండా ప్రముఖ దర్శకులు విసు తెలుగులో నటించిన ‘శ్రీమతి ఒక బహుమతి’, ‘ఆడదే ఆధారం’, ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఇక రుద్రవీణలో జెమినీ గణేషన్‌కు, ‘పసివాడి ప్రాణం’ సినిమాలో రఘువరణ్‌కు, ఆదిత్య 369లో టినూ ఆనంద్‌కు, అటు కన్నడ హీరోలైన విష్ణు వర్ధన్, మలయాళ హీరో మోహన్ లాల్ నటించిన ‘ఇద్దరూ’ సినిమాలో ఆయనకు డబ్బింగ్ చెప్పారు. అటు తమిళ నటులు నగేష్, కార్తీక్ వంటి హీరోలకు బాలు గాత్రం అచ్చుగుద్దినట్టు సరిపోయింది. శ్రీ ఆంజనేయం సినిమాలో అర్జున్‌కు, స్లమ్‌డాగ్ మిలినయనీర్ సినిమాలో అనిల్ కపూర్‌కు, అతడు సినిమాలో నాజర్‌కు డబ్బింగ్ చెప్పారు. ఇక బాలు డబ్బింగ్ చెబుతుంటే.. అవతలి వాళ్లు నిజంగానే మాట్లాడినట్టుగా ఉంటుంది. దటీజ్ ఎస్పీ బాలు స్పెషాలిటీ. మొత్తంగా డబ్బింగ్ విషయంలో కూడా బాలు తనదైన ప్రత్యేక ముద్ర వేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood