SP Balasubrahmanyam Birth Anniversary: | ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు. ఎస్పీ బాలు విషయానికొస్తే.. ఆయన గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలిచాయి. ఆయన పాట శ్రోతలకు పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరగాడే గంధర్వులు భువికి దిగి వచ్చి పాడినట్లుగా ఉంటుందా గాత్రం. ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి.బాలు గొంతులో భక్తి తొణికిస లాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి.
పాటలోని మాటలను ...గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రమణ్యం. ఆయన గొంతకు తరాల అంతరాలు తెలియదు.
బాలసుబ్రహ్మణ్యం.. ,1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్. పి. బీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం.
గాయకుడిగా కెరీర్ ప్రారంభించాక ఆయనకు పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు. కేవలం అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోలకే పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, ఏన్నార్లకు ఘంటసాల తప్ప ఎవరు పాడినా.. ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. అయిన అడపా దడపా ఘంటసాలతో గొంతు కలిపే పాడే అరుదైన అవకాశాలు.. బాలుకు రానే వచ్చాయి. ప్రతిరాత్రి వసంత రాత్రి.. ప్రతిగాలి పైర గాలి.. అంటూ ‘ఏకవీర’ లో అమర గాయకుడు ఘంటసాల తో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హమ్ చేసుకునేలా ఉంటాయి.
ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కైయ్యారు బాల సుబ్రహ్మణ్యం. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ..సన్నివేశ బలానికి తగినట్టు నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల గాయకుడు ఎప్పీ. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు.
పదాల మాధుర్యాన్ని గమనించి.. బాలూ చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకి చేరువ చేసింది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి.. ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలూ పాడితేనే సాధ్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటారు బాలూ. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.
‘చెల్లెలి కాపురం’ లో బాలు పాడిన.. చరణ కింకరులు ఘల్లు ఘల్లు మన...కర కంకణములు గల గల లాడగా అంటూ ఎస్పీ తన గొంతులో పలికించిన వేరియేషన్స్ శ్రోతల మదిలో ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఏపాట పాడినా.. ఆ పాటకే అందం వచ్చేంతగా ఆలపించడం బాలు కి తప్పించి మరొకరికి సాధ్యం కాదు. భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడ్డంలో బాలూ శైలే వేరు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.
గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించారు బాలు. సంగీత దర్శకుడిగా ‘పడమటి సంధ్యారాగం’, ‘జాకీ’, ‘మగధీరుడు’, ‘జైత్రయాత్ర’ వంటి యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించారు. నిర్మాతగా ‘కెప్టెన్ కృష్ణ, ఆదిత్య369, శుభసంకల్పం, భామనే సత్యభామనే, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నారు. బాలసుబ్రమణ్యం పాటలు పాడుతుంటే వినేవారికి మాటలు రావు. ఓ పాపా లాలి చిత్రంలో ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అంటూ...బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.
నాడు ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరి పాట తెలియని సంగీత రసజ్ఞులు ఉండరు. తన గురువు ఘంటసాల బాటలో ‘భైరవ ద్వీపం’లో బాలూ పాడిన శ్రీ తుంబుర నారద నాదామృతం పాటలో..బాలూ ఆలపించిన గంధర్వ గానం శ్రోతలకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.నాలుగు దశాబ్దాల్లో...11భాషల్లో 40వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు బాలు. ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు.
చనిపోయే కొన్ని నెలల క్రితమే నెల్లూరిలో ఉన్న సొంత ఇంటిని శంకరాచార్య పీఠానికి ఇచ్చారు. ఉత్తమ గాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డు. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. చనిపోయిన తర్వాత కేంద్రం ఈయనకు పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తెలుగులో ఏఎన్నార్ తర్వాత మూడు పద్మ పురస్కారాలు అందుకున్నది దివంగత బాలూ గారే కావడం విశేషం. గతేడాది ఆగష్టు 5న బాలు గారు కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ గతేడాది 74 ఏళ్ల వయసులో 2020 సెప్టెంబర్ 24న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. బాలు మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసినట్టైయింది. అంతేకాదు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు. అందుకే బాలు నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఇప్పటికీ ఎప్పటికీ తరగని నిధి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood