ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా అస్సలు తగ్గడం లేదు. వెండితెర కాకుండా, బుల్లితెర, డిజిటల్ మీడియాకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో మన దర్శక నిర్మాతలు పలు రంగాల్లో ప్రతిభ చూపించిన వ్యక్తుల జీవిత చరిత్రలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లిస్టులోకి సీనియర్ హీరోయిన్ సుమలత చేరింది. ప్రస్తుతం ఈమె కర్ణాటక లోక్‌సభ ఎంపీగా కూడా ఉన్నారు. భర్త అంబరీష్ మరణం తర్వాత మాండ్య ప్రాంతం నుంచి సుమలత పార్లమెంట్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. అది కూడా స్వతంత్ర్య అభ్యర్థిగా. ఈమె జీవితంలో నటిగా రంగ ప్రవేశం చేయడం, అగ్ర కథానాయకులతో నటించడం, పెళ్లి, ఇప్పుడు రాజకీయాల్లో విజయం సాధించడం అంశాలను కూర్చి బయోపిక్‌గా రూపొందించనున్నారట. కన్నడ దర్శక నిర్మాత గురుదేశ్ పాండే సుమలతను కలిసి బయోపిక్ రూప కల్పన గురించి డిస్కస్ చేశారట. ఈ బయోపిక్ కన్నడలోనే రూపొందుతుందని అంటున్నారు. కన్నడలో రూపొందించి తర్వాత ఇతర భాషల్లోకి అనువాదం చేస్తారా..? అని తెలియడం లేదు. ఇక్కడ పేర్కొనాల్సిన విషయం ఏంటంటే.. సుమలత బయోపిక్ సినిమా రూపంలో కాకుండా వెబ్ సిరీస్‌గా రూపొందుతుందట.
సుమలత సినీ రంగంలో పలువురు స్టార్స్‌తో నటించి తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక రాజకీయాల్లోనూ ఆమె గెలుపు సినిమానే తలపించింది. ఆమెకు ప్రధాన పార్టీలేవీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసింది. సినీ పరిశ్రమలో యష్, దర్శన్ సహా పలువురు హీరోలు సుమలత గెలుపు కోసం ప్రచారం చేశారు. సుమలత విజయాన్ని సాధించారు. మరి ఈ బయోపిక్‌లో సుమలత పాత్రలో ఎవరు నటిస్తారు? ఇప్పటి పాత్రను సుమలత పోషిస్తారు కానీ.. యువ సుమలత పాత్రను ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరమైన అంశమే.
సినిమాల విషయానికి వస్తే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్', సావిత్రి బయోపిక్ 'మహానటి'. వెండితెరపై ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ క్వీన్ పేరుతో వెబ్ సిరీస్‌గా రూపొందింది. అలాగే కంగనారనౌత్, నిత్యామీనన్‌లతో రెండు సినిమాలు కూడా రూపొందుతున్నాయి.