ఈ రోజుల్లో చూస్తున్నాం కదా.. సినిమాల్లో నాన్న పాత్ర అంటే కనీసం మర్యాద కూడా ఉండదు.. ఏదో గాలివాటం పాత్రలా అలా ఉండిపోతుందంతే. దానికి గౌరవం కూడా ఇవ్వరు. కొన్ని సినిమాల్లో హీరోలు నాన్నను తిడుతుంటారు కూడా. అలాంటి సినిమాల మధ్య కూడా కొన్ని సినిమాల్లో నాన్నను గౌరవప్రదంగానే కాదు.. దేవుడిగా చూపిస్తుంటాయి. అలాంటి ఓ అద్భుతమైన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. అందులో విలువలే నా ఆస్తి అంటాడు హీరో. ఆ విలువలు కూడా నాన్న ఇచ్చినవే.
చనిపోయిన తర్వాత కూడా నాన్న గౌరవాన్ని కాపాడే కొడుకు కథ ఇది. నువ్వు చనిపోయి అయినా మరొకరిని కాపాడాలనుకునే ఉన్నత విలువలున్న తండ్రి కథ ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి 2015లో విడుదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, సమంత జంటగా నటించారు. తండ్రిగా ప్రకాశ్ రాజ్ కనిపించాడు. ఆయన పాత్ర సినిమాలో మహా అయితే ఉండేది 10 నిమిషాలే.. కానీ అదే సినిమా అంతా నడిపిస్తుంది. ఆయన చెప్పిన విలువలే కొడుకు పాటిస్తుంటాడు. తండ్రిని ఎవరు ఏ చిన్న మాటన్నా కూడా పడడు.. చనిపోయిన మనిషి కోసం రాక్షసుడి లాంటి మనిషితో పోట్లాడటానికి సిద్ధమవుతాడు.
తండ్రి కోసం కొడుకు పడే ఆరాటాన్ని ఈ చిత్రంలో చాలా బాగా చూపించాడు త్రివిక్రమ్. అలాగే సినిమాలో నాన్న గురించి మాటలు కూడా చాలా అద్బుతంగా ఉంటాయి. నాన్న అంటే మరిచిపోలేని ఓ జ్ఞాపకం అంటూ మంచి మాటలు రాసాడు మాటల మాంత్రికుడు. ఈ చిత్రం విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ ఫాదర్ సెంటిమెంట్ సినిమాల్లో సన్నాఫ్ సత్యమూర్తి కూడా తప్పకుండా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Fathers Day 2020, Telugu Cinema, Tollywood