Home /News /movies /

SOFTWARE SUDHEER MOVIE REVIEW AND SUDIGALI SUDHEER DEBUT WITH A LOGIC LESS COMEDY DRAMA PK

రివ్యూ: సాఫ్ట్‌వేర్ సుధీర్.. లాజిక్ లేని సుడిగాలికి అంతా ఫసక్..

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)

జబర్దస్త్ కామెడీ షో నుంచి కమెడియన్‌గా వచ్చి ఇప్పుడు హీరో వరకు ఎదిగాడు సుడిగాలి సుధీర్. ఈయన సినిమా అనగానే ఎక్కడో తెలియని క్రేజ్ అయితే ఉంది. మరి ఈయన ఆ అంచనాలు అందుకున్నాడా..? ఇప్పటి వరకు జబర్దస్త్ కమెడియన్స్ హీరోలుగా సక్సెస్ కాలేదు మరి సుధీర్ అది సాధించి చూపించాడా..?

ఇంకా చదవండి ...
నటీనటులు: సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ, సాయాజి షిండే, ఇంద్రజ తదితరులు
ఎడిటింగ్: గౌతంరాజు
సంగీతం: భీమ్స్
నిర్మాత: శేఖర్ రాజు
దర్శకుడు: రాజశేఖర్ పులిచర్ల

జబర్దస్త్ కామెడీ షో నుంచి కమెడియన్‌గా వచ్చి ఇప్పుడు హీరో వరకు ఎదిగాడు సుడిగాలి సుధీర్. ఈయన సినిమా అనగానే ఎక్కడో తెలియని క్రేజ్ అయితే ఉంది. మరి ఈయన ఆ అంచనాలు అందుకున్నాడా..? ఇప్పటి వరకు జబర్దస్త్ కమెడియన్స్ హీరోలుగా సక్సెస్ కాలేదు మరి సుధీర్ అది సాధించి చూపించాడా..?

కథ:
సుధీర్ (సుడిగాలి సుధీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లి కావడం లేదని తన పేరు చందుగా మార్చుకుంటాడు. ఈ క్రమంలోనే తన సహ ఉద్యోగి (ధన్య బాలకృష్ణ) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ అదే సమయంలో అనుకోకుండా చందు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. దాంతో జాతకం చూపిస్తే అందులో కొన్ని దోషాలు ఉంటాయి. ఆయనపై శని ప్రభావం ఉందని స్వామిజీ చెప్పడంతో ఓ యాగం చేస్తాడు. ఇక చందు తండ్రి (సాయాజీ షిండే) మంత్రి దగ్గర పిఏగా పని చేస్తుంటాడు. చందు యాగం చేస్తున్న సమయంలోనే మంత్రి నుంచి 1000 కోట్లు కొట్టేస్తారు దొంగలు. అప్పుడు చందు ఏం చేసాడు.. అసలు ఆ 1000 కోట్ల స్కామ్‌ను హీరో ఎలా చేధించాడు అనేది అసలు కథ..

కథనం:
జబర్దస్త్ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుధీర్. అక్కడ్నుంచి వరసగా సినిమాల్లో చిన్న పాత్రలు కూడా చేసాడు. అయితే ఇప్పుడు హీరోగా మారడంతో అంతా షాక్ అయ్యారు. తన క్రేజ్ వాడుకుంటూ సాఫ్ట్‌వేర్ సుధీర్ అంటూ వచ్చాడు. హీరోగా మారిపోయాననే సంతోషమో ఏమో కానీ అసలు కథ ఉందో లేదో కూడా చూసుకోకుండా వచ్చేసాడు సుధీర్. కేవలం డబ్బులు వస్తే చాలనుకున్నాడో లేదంటే కథ ఎలా ఉన్నా కూడా తనకు టెలివిజన్‌పై ఉన్న క్రేజ్‌తో బయటపడిపోవచ్చేమో అనుకున్నాడో తెలియదు కానీ కథ కాకరకాయ అంటూ లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుధీర్. అసలు ఇలాంటి సినిమా చేయడం కంటే కూడా కామ్‌గా కామెడీ చేసుకోవచ్చు కదా అనేలా ఉంది సాఫ్ట్‌వేర్ సుధీర్. లాజిక్స్ లేకుండా జబర్దస్త్ జోకులు వేసుకుంటూ కథ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని స్క్రీన్ ప్లేతో ముందుకెళ్లింది ఈ చిత్రం. అసలు దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల ఏం చెప్పాలని సినిమా తీసాడో.. ఏం చెప్పాడో కూడా క్లారిటీ లేదు. ఫస్ట్ సీన్ నుంచే జబర్దస్త్ జోకులు ఇక్కడ కూడా వేసాడు సుధీర్. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది అనుకుంటే అసలు కథే లేకుండా పోయింది ఈ చిత్రంలో. ఎక్కడో మొదలై.. మంత్రాలు తంత్రాలు అనుకుంటూ సెకండాఫ్‌లో రైతులు.. వాళ్ల ఆత్మహత్యలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది. తల తోక లేకుండా తీసిన సినిమా కావడంతో కామెడీ కాదు కదా ఏదీ వర్కవుట్ కాలేదు. ఈ మొత్తం సినిమాలో ఏదైనా ప్లస్ ఉందా అంటే అది సుధీర్ డాన్సులు మాత్రమే. నటుడిగా కూడా సుధీర్ ఇంకా ఇంప్రూవ్ కావాలేమో..? అవే జబర్దస్త్ పంచులు వేస్తే వెండితెరపై వర్కవుట్ కావని ఇదివరకే తేలింది.. అయినా కూడా అదే చేసాడు సుధీర్. ఫస్టాఫ్ అంతా అలా జోకులతో కాలం గడిపేసి.. జాతకంలో దోషం పేరుతో యమలీలలో అలీకి ఇచ్చినట్లు భవిష్యవాణిని ఇచ్చి కాలం గడిపేసాడు దర్శకుడు. సెకండాఫ్‌లో అసలు ఫ్లాష్ బ్యాక్ ఎందుకొస్తుందో కూడా అర్థం కాదు. క్లైమాక్స్ రైతుల బాధలు అంటూ ముగించేసాడు. మధ్యలో గద్ధర్ పాట కూడా పెట్టేసాడు. ఇలా ఏది పడితే అది తీసేసి పొట్లం కట్టినట్లు చుట్టేసాడు దర్శకుడు రాజశేఖర్.

నటీనటులు:
సుధీర్ పర్లేదు.. హీరోగా కాదు కానీ నటుడిగా అక్కడక్కడా పర్లేదనిపించాడు. కానీ రవితేజ, రజినీకాంత్‌ను తెలియకుండానే ఇమిటేట్ చేసాడు సుధీర్. ధన్య బాలకృష్ణ గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సాయాజీ షిండే, ఇంద్రజ, శివప్రసాద్ పర్లేదు.. తమకు ఉన్నంతలో పర్లేదనిపించారు.

టెక్నికల్ టీం:
భీమ్స్ సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు. ఎంత అందమో పాట మాత్రం సుధీర్ డాన్సులతో పర్లేదు అనిపిస్తుంది. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్ కత్తెర చాలా వీక్. అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్లేదు. దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల కథ చాలా పాతదే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే అయినా బాగా రాసుకుని ఉంటే బాగుండేదేమో కానీ అలా కూడా జరగలేదు. అసలు లాజిక్కులతో పని లేకుండా 1000 కోట్ల స్కామ్‌ను ఏదో చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినంత ఈజీగా రైతులకు పంచేయడం ఏంటో దర్శకుడికే తెలియాలి. అలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. నిర్మాత శేఖర్ రాజు నటుడిగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నిర్మాణ విలువలు పర్లేదు.

చివరగా ఒక్కమాట:
సాఫ్ట్‌వేర్ సుధీర్.. లాజిక్ లేని లైట్ కామెడీ..

రేటింగ్: 1.5/5
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Software sudheer, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు