SIRIVENNELA SEETHARAMA SASTRY NO MORE AND HIS FILM JOURNEY SIRIVENNELA TO PADMA SHRI TA
Sirivennela Seetharama Sastry : ‘సిరివెన్నెల’ నుంచి ‘పద్మశ్రీ’ వరకు సీతారామశాస్త్రి సినీ సాహితీ ప్రస్థానం..
సిరివెన్నెల నుంచి పద్మశ్రీ వరకు సీతారామశాస్త్రి సినీ ప్రస్థానం (Twitter/Photo)
Sirivennela Seetharama Sastry : తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ‘సిరవెన్నెల నుంచి పద్మశ్రీ వరకు ఆయన సినీ ప్రస్థానం పై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ..
Sirivennela Seetharama Sastry : తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. సీతారామశాస్త్రి మరణంపై భారత ఉప రాష్ట్రపతివెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైయస్ జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ప్రస్తుతం తెలుగులో ఏదైనా ప్రత్యేక పాట రాయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈయనే. ఈ మంగళవారం న్యూమెనియా (ఊపిరితిత్తుల కాన్సర్)తో కన్నుమూసారు. సీతారామశాస్త్రి పాటలతో తెలుగు సినిమా పునీతమైందనే చెప్పాలి. ఈయన పాటలతో తెలుగు సినీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది.
‘సిరివెన్నెల’ విషయానికొస్తే.. పదాలతో ప్రయోగాలు చేయడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య.. తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన ఒకానొక పారిజాతపుష్పం. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను సృష్టించారు. తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు. అతని పాట ప్రతి నోటా అనేలా ఉంటాయి. అతని రాక తెలుగు సినిమా పాటకు ఏరువాక. చిన్నచిన్న పదాలతో అనితర సాధ్యమైన సాహిత్యం.. ఆయనకే చెల్లింది. తెలుగు సినిమా యవనికపై సాహితీ సిరివెన్నెల కురిపించిన సినీకవి సీతారామశాస్త్రీ. ఇక తెలుగు సినీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం ఆయన్ని 2019లో పద్మశ్రీ సత్కరించింది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులు మీదుగా సిరివెన్నెల ఈ అవార్డు అందుకున్నారు. తన పాటలతో మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలేన్నో వేస్తారు. శాస్త్రీయ గీతమైనా...ప్రణయ గీతమైనా...సందేశాత్మక గీతాలైనా ..ఇలా ఏరకమైన గీతాలైనా ఆయన కలం నుంచి ఆశువుగా జాలువారుతాయి. ఆదిభిక్షువు వాడినేమి కోరేది బూడిదిచ్చే వాడినేమి అడిగేది అంటూ పరమశివుని తత్వాన్ని చాటిన అపర సాహితి ఋషి సిరివెన్నెల. 1955 మే 20న విశాఖపట్నం, అనకాపల్లిలో జన్మించారు సీతారామశాస్త్రీ. మొదట టెలిఫోన్ డిపార్ట్ మెంట్ లో సాధారణ ఉద్యోగిగా ఉంటూ పద్యాలు గేయాలు రాసేవాడరు. ఒకసారి ఆయన రాసిన ‘గంగావతరణం’ అనే గేయాన్నిచూసిన కళాతపస్వీ కె.విశ్వనాథ్ సీతారామశాస్త్రిగారికి తన దర్శకత్వంలో వహించిన ‘జననీ జన్మభూమి సినిమాలో సినీ రచయతగా అవకాశం ఇచ్చారు.
ఆ తర్వాత సిరివెన్నెల సినిమాతో ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. . ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు ఈ మధ్యకాలంలో . జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాసారు సీతారామశాస్త్రి. ఆ తర్వాత కే.విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. ముఖ్యంగా ఆది భిక్షువు వాడిని ఏది కోరేది.. అంటూ ఆయన రాసిన పాటలు ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. సిరివెన్నెల మూవీలోని సాహిత్యానికి సీతారామశాస్త్రి ఇంటికి శివుని వాహనం ‘నంది’ అవార్డు రూపంలో రంకెలేస్తూ రావడం విశేషం.
‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని...నిప్పుతోని కడుగు ఈ సమాజ జీవచ్ఛావాన్ని’ అంటూ తన సాహిత్యంతో ‘మారదు లోకం మారదు కాలం’ అంటూ సమాజంలో ఉన్న కుళ్లును తన కలంతో కడిగిపారేసారు. ఈ మూవీలో కనిపించి వినిపించారు సీతారామశాస్త్రీ.
అర్థ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వరాజ్య మందామా....దానికి స్వర్ణోత్సవాలు చేద్దామా?’ అంటూ తన పాటలతో అగ్గిరవ్వలను జేశారు. రాసే ప్రతి సినిమాకు కొత్తగా సాహిత్యం అందించడంలో ఆయన నిష్ణాతుడు. ‘సురాజ్యమవలేని స్వరాజ్య మెందుకని’ తన పాటతో ప్రశ్నించారు. ‘సిందూరం’ మూవీలో ఆయన రాసిన ఈ సాహిత్యానికి అభినందించని సినీ ప్రియులుండరు. ఈ పాటకు సైతం శాస్త్రీకి నంది అవార్డు వశం కావడం విశేషం.
సిరివెన్నెల (Sirivennela Seetharama Sastry)
అలాగే ఎవరో ఒకరు ఎప్పుడో అపుడు.. నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అంటూ ...మొదటగా ముందడుగు నీవెయ్యి.. నీ వెనుకే సమాజం వస్తుంది అని చెప్పాడు. రాసిన ప్రతీ పాటలో విలువైన పదాన్ని పొదిగి ఆ గీతానికి విలువను ఆపాదించడంలోనూ శాస్త్రీ స్టైలే వేరు.
సమాజాన్ని సంస్కరించే గీతాలే కాదు..అలనాటి కవులు బాణీలో సాహితీ సౌరభాలందించారు సీతారామ శాస్త్రీ. శృతిలయలు సినిమాలో ‘తెలవారదేమో స్వామి’ అంటూ ఆయన రాసిన శాస్త్రీయ గీతాన్ని మొదటగా అన్నమయ్య కృతిగా భావించారు. అంతలా మమేకమై రాసిన అద్భుత కవి శాస్త్రీ. అలనాటి కవుల ప్రబంధాల్లా సాహిత్యం రాయడంలో తనకు సాటిలేదని నిరూపించుకొన్నారు.
‘స్వర్ణ కమలం’ మూవీలో ఆయన రాసిన ఓం నమో నమ: శివాయ అంటూ ఆయన రాసిన పదాలు ఓంకారనాదం లా మన చెవుల్లో ఇప్పటికీ ఝుమ్మంటునే ఉన్నాయి. అందెల రవళికి పదముల తానై అనే చరణానికి.. నాట్యానానికి ,నటరాజ స్వామికి మధ్య బంధాన్ని తన కలంతో పండిత పామర జనరంజకంగా రాసి ఇటువంటి గీతాలలో తనకు తిరుగులేదని పించుకున్నారు.
‘భద్రం బి కేర్ ఫుల్ బ్రదు భర్తకు మారకు బ్యాచిలరు’ అని పాడుకేనే ఆధునిక బ్రహ్మచారుల శైలీని అద్ధం పట్టింది. కామెడీ పాటలను రాయడంలో తనకు సాటిరారని నిరూపించుకున్నారు శాస్త్రీ.
‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’..అంటూ ‘చక్రం’ సినిమాలో ఆయన రాసిన ఈ పాట ఆయనలోని తాత్వికుడ్ని మన ముందు ఆవిష్కరించింది. కవినై...కవితనై...భార్యనై...భర్తనై...అన్ని తానే అంటాడు. అందరు ఉన్న నా జీవితం ఒంటరి అన్నాడు ఈ పాటలో.. పాటను అర్థం అయ్యేలా రాయనక్కర్లేదు. అర్ధం చేసుకునే కోరిక పుట్టేలా రాసి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి శాస్త్రీ.
కొంత మంది ఇంటి పేరు కాదుర గాంధీ...ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. అంటూ బాపూజీ అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ‘ఎంత వరకు ఎంత వరకు’ అంటూ ‘గమ్యం’లో ఆయన రాసిన గేయంలో.. సమాజంలో ఉన్న గాయాలను కళ్లకు కట్టినట్లు చూపాడు. తెలుగులో దాదాపు అందరి హీరోలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. 2019 ఏడాదికి గాను కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావించాలి.
కేంద్రం నుంచి పద్మశ్రీ అవార్డు (Twitter/Photo)
సీతారామశాస్త్రి విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి ’ఆర్ఆర్ఆర్’సినిమాలో ‘దోస్తి’ సాంగ్ రాసారు ఈయన. అటు ‘శ్యామ్ సింగరాయ్’ తో పాటు పలు చిత్రాల్లో ఒకటి రెండు చిత్రాల్లో ఆయన గేయ పరిమళాలను ఆస్వాదించవచ్చు. ఈ యేడాది విడుదలైన వెంకటేష్ నారప్పలో రెండు పాటలు రాసారు సిరివెన్నెల. కొండపొలంలోనూ ఈయన పాటలు రచించారు. ఏదేమైనా ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరిని లోటు అని చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.