Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహితి హిమాలయం.. ఇళయరాజా భావోద్వేగ ట్వీట్‌తో కూడిన ఒక లేఖను విడుదల చేశారు. తెలుగు సినీ సాహితీ సౌరభంలో సిరివెన్నెల మరణంతో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. దాదాపు 200పైగా చిత్రాల్లో 3000కు పైగా పాటలు రాసారు. అంతేకాదు తెలుగు సినీ ప్రస్థానంలో 11 నందులు, 4 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. సీతారామశాస్త్రి మరణంపై భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైయస్ జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఇళయారాజా.. సిరివెన్నెల మరణంపై భావోద్వేగ ట్వీట్ చేసారు.
ఇక ఇళయరాజా అందించిన ఎన్నో సినిమాలకు సిరివెన్నెల సాహిత్యం అందించారు. ముఖ్యంగా కళాతపస్వీ దర్శకత్వం వహించిన ‘స్వర్ణ కమలం’తో పాటు బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’లో ఇళయారాజా సంగీతానికి సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఇక బాలు ఆ సంగీత, సాహిత్యాలకు ప్రాణం పోసారనే చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం కళాత్మకతని, కవితాత్మని అందించి, అందమైన, అర్థవంతమైన,సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలో నగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు అంటూ ఆయన గొప్పతనాన్ని వివరించారు.
ఇద్దరం కలిసి అది తాగుదాం.. సీతారామశాస్త్రికి రామ్ గోపాల్ వర్మ విభిన్న నివాళి..
ఇక సీతారామశాస్త్రితో తనది ఎన్నో సంవత్సరాల ప్రయాణం అన్నారు. శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి, అతి తక్కువ కాలంలో శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతి పుత్రుడు. మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి. తన పాటల పదముద్రలు నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయన్నారు. రుద్రవీణ, స్వర్ణకమలం, శివ, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు. రేపు రాబోయే రంగమార్తాండ కూడా. సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో అంటూ గుర్తు చేసుకున్నారు.
సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు. పాటలో అంతర్మథనం చెందుతాడు. పాటని ప్రేమిస్తాడు. పాటతో రమిస్తాడు. పాటని శాసిస్తాడు. పాటని పాలిస్తాడు. పాట నిస్తాడు. మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు. అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివతాండవం చేయించాయి. వేటూరి నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే, సీతారాముడు నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచారన్నారు. ధన్యోస్మి మిత్రమా.
ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది. పాటకోసమే బ్రతికావు. బ్రతికినంత కాలం పాటలే రాసావు. ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఇళయరాజా రాసిన ఈ లేఖ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ilaiyaraaja, Sirivennela Seetharama Sastry, Telugu Cinema, Tollywood