Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రీ తెలుగు సినిమా సాహిత్యంలో చెరగని పేజీ ఆయన పాట. 165 కు పైగా చిత్రాలకు 3 వేలకు పైగా పాటలు రాసి మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానం సాధించుకొన్నారు ఆయన. సిరివెన్నెల రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం, ఈ పాట గొప్పది.. ఈ పాట తక్కువ అని చెప్పలేం. ప్రతీ పాటలో ఏదో ఒక చమక్కు అందించడం ఆయన గొప్పతం. మూడువేల పాటల్లో ఎన్నో పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆయన కలం నుంచి జారువాలిన ఎన్నో ఆణిముత్యాల్లో కొన్ని మనసును కదిలించే పాటల వివరాలు.
- ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చిన సినిమా సిరివెన్నెల సినిమాలో "ఆది భిక్షువు వాడినేది కోరేది...బూడిదిచ్చేవాడినేది అడిగేది... "అంటూ తనలోని తాత్వికతను చాటారు. ఎందరికో ఆనందాన్ని కలిగించే పూలకు కొంత కాలమే జీవనాన్ని ఇచ్చి.. బండరాళ్లను చిరాయువుగా జీవించమన్న వాడిని ఏమని అడిగాలి అంటూ రాసిన పాట మనసును కదిలించకుండా ఉంటుందా.. శివతత్వం అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అనే గొప్ప సాహిత్య విమర్శ ఈ పాట.
Sirivennela Seetharama Sastry : కళా తపస్వీ విశ్వనాథ్‌తో సీతారామశాస్త్రి ప్రత్యేక అనుబంధం..
- సిరివెన్నెల కలం నుంచి వచ్చి అద్బుత సాహిత్యం సౌరభం స్వర్ణ కమలం పాట. "శివపూజకు చిగురించిన సిరిసిరి మువ్వ". ఈ పాటలో "పరుగాపక పయనించవె తలపుల నావ.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ" అంటూ చిన్న పదాలతో మనసును కదిలించడం సిరివెన్నెలకే సొంతం.
- గాయం సినిమాలో "నిగ్గదీసి అడుగూ" అంటూ సమాజంలోని లోపాని చెప్పడానికి ఆయన కలం భయపడలేదు "పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా.. అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా.. వేట అదే వేటు అదే నాటి కధే అంతా.. నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా.. బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా.. శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ.." అప్పటికీ ఇప్పటికే ఎప్పటికీ మారని సమాజం తీరుపై పెద్ద సమీక్ష..
- మనీ సినిమాలోని "చక్రవర్తికీ.. వీధి బిచ్చగత్తెకీ..బందువవుతానని అంది మనీ మనీ.." ఈ పాట సున్నితంగా సరదాగా సాగినా.. "అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది మనీ మనీ" అంటూ మనిషి జీవితంలో డబ్బు ప్రాధాన్యతను విడదీయ లేం అని మర్చిపోలేని విధంగా చెప్పడం ఆయనకే సొంతం.
- సినిమా పాటలే కాదు సీరియల్ పాట మనను ఎప్పటికీ ప్రభావం చూపేలా రాయడం ఆయనకే సొంతం.
"వార్తల్లొ హెడ్ లైన్సా... మన కొచ్చే చిలిపి కష్టాలు.. అయొడిన్ తో అయిపోయే.. గాయాలే మనకు గండాలు.. మనం ఈదుతున్నాం.. ఒక చెంచాడు భవ సాగరాలు.. కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు... కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు" అంటూ అమృతం సీరియల్‌కు అనువైన పాట అందించడమే కాదు. అందులో మధ్యతరగతి జీవితాల ఆశల సౌధాలు.. అవి సాధించలేక వెనుకబడే ఇబ్బందులు హాస్యంగా చెప్పడం ఆయన సొంతం.
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో "చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా" పాటలో జీవితం ఎంత అందగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించడం ఆయనకే చెల్లింది. "ఆకతాయి సందడి గా ఆగలేని తొందరగా.. సాగుతున్న ఈ పయనం ఎంతవరకు.. రేపువైపు ముందడుగా లేనిపోని దుందుడుకా.. రేగుతున్న ఈ వేగం ఎందుకొరకొ.." అంటూ మనసు ఆరాటాన్ని రుచిచూపించడం ఆయనకే చెల్లింది.
ఒక్కటా రెండా.. ఎన్నో పాటలు ప్రతీ పాటకు ఒక నేపథ్యం అందించడం.. అందులో భావాన్ని.. అర్థవంతంగా చెప్పడం సిరివెన్నెలకు వెన్నతోపెట్టిన విద్య. ఇలాంటి ఎన్నో పాటలను మనకు అందించి.. మనకు దూరం అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.