ప్రముఖ నేపధ్య గాయకురాలు సునీత (Singer Sunitha) ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనిని సునీత వివాహం చేసుకున్నారు. జనవరి 9న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న సింగర్.. ఇటు సినిమాల్లో కూడా మళ్లీ బిజీ అయిపోయారు. సునీత తాజాగా ఇన్‌స్టగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (S. P. Balasubrahmanyam)తో కలిసి పాడుతున్న వీడియోను అందరితో పంచుకున్నారు. ఎస్పీ బాల సుబ్రమణ్యంతో సునీతకు ప్రత్యేక అనుబంధముంది. ఇద్దరు కలిసి ఎన్నో పాటలను ఆలపించారు. ఈ క్రమంలోనే ఆయన్ను మరవలేక మరోసారి తన పాట రూపంలో గుర్తు తెచ్చుకున్నారు సునీత.
''సీతారామరాజు'' మూవీలోని ''ఏవండోయ్ శ్రీవారు..'' అంటూ సాగే.. పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం, సునీత కలిసి ఓ స్టేజీపై పాడారు. ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా ఆలపించారు. ఆ పాటను షేర్ చేసిన సునీత.. ఎస్పీ బాలుని గుర్తు చేసుకున్నారు. లవ్ ఎమోజితో ఆ వీడియోను పోస్ట్ చేశారు. మీ గాత్రం అద్భుతమంటూ కొనియాడారు.
కాగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబరు 25న మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధ్యపడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో కన్నుమూశారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. దాదాపు 50 రోజుల పాటు చికిత్స పొందారు. కరోనాతో నెల రోజులు పోరాడి గెలిచారు. నెగిటివ్ వచ్చిన తర్వాత ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లారు. ఇటీవల ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అరుదైన గౌరవం దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఎస్పీ బాల సుబ్రమణ్యానికి తమిళనాడు కోటాలో అవార్డును అందజేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Singer Sunitha, SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood