సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన 'డీజే టిల్లు' మూవీ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో సిద్దు నటన యూత్ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Nagavamsi), సిద్ధుతో 'డీజే టిల్లు' సీక్వెల్ (Dj Tillu Sequal) చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే 'డీజే టిల్లు' సీక్వెల్ ని రూపొందిస్తూ మాట నిలబెట్టుకున్నారు నాగవంశీ. తాజాగా ఈ సీక్వల్ పై సిద్దు పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ చెబుతూ ఈ సారి ఫీల్ ఫ్రెష్ గా, కొత్తగా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా అంటూ సిద్ధు జొన్నలగడ్డ ట్వీట్ పెట్టారు. ఈ మేరకు సెట్స్ పై దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ ట్వీట్ వదిలారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఫీల్ కోసం మేము నిజంగా వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Working on #tillusquare. I promise a fresh and a new ride ! pic.twitter.com/lhlbqahzUW
— Siddhu Jonnalagadda (@Siddu_buoy) November 26, 2022
ఈ సినిమాకు 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 24న అధికారికంగా ప్రకటించి సెట్స్ మీదకు తెచ్చారు. ఈ మూవీలో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
బాక్సాఫీస్ దగ్గర 'డీజే టిల్లు' సంచలనం సృష్టించిన ఏడాదికే అంటే 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో ఈ టిల్లు స్క్వేర్ సందడి చేయనుంది. 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్ ని స్వరపరిచి విశేషంగా ఆకట్టుకున్న రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. 'టిల్లు స్క్వేర్'తో రెట్టింపు వినోదాన్ని పంచి, 'డీజే టిల్లు'ని మించిన విజయాన్ని సాధిస్తామని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. చూడాలి మరి ఈ సారి టిల్లు గాడి హవా ఏ రేంజ్ లో ఉంటుందనేది!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.