నటీనటులు: నాని, సాయి పల్లవి, కృత శెట్టి, మడొన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, జిష్సు సేన్ గుప్తా తదితరులు
సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్గేసే
సంగీతం: మిక్కీ జే మేయర్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
రచన : జంగా సత్యదేవ్
దర్శకత్వం: రాహుల్ సాంకృత్యన్
రెండేళ్లుగా థియేటర్స్ మొహం చూడని నాని.. చాలా రోజుల తర్వాత శ్యామ్ సింగరాయ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పైగా ఈ క్రిస్మస్ మనదే అంటూ గట్టిగా చెప్పాడు. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన శ్యామ్ సింగరాయ్ ఎంతవరకు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. నిజంగానే నాని చెప్పినట్లు ఈ క్రిస్మస్ ఆయన తీసుకుంటాడా..?
కథ:
వాసు దేవ్ (నాని)కు సినిమాలంటే ప్రాణం. దానికోసం తన సాఫ్ట్ వేర్ జాబ్ కూడా వదిలేసి సినిమాల్లోకి వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే ఓ నిర్మాత ఆఫర్ కూడా ఇస్తాడు అయితే అది పొందాలంటే ముందుగా ఓ షార్ట్ ఫిల్మ్ చేసి మెప్పించాలని కండీషన్ పెడతాడు. ఈ క్రమంలోనే తన షార్ట్ ఫిల్మ్‌లో సరిపోయే హీరోయిన్ కోసం వెతుకుతుండగా కీర్తి (కీర్తి శెట్టి) కనిపిస్తుంది. ఆమెతోనే షార్ట్ ఫిల్మ్ చేస్తాడు. ఆ తర్వాత సినిమా కూడా చేస్తాడు. దాన్ని హిందీలో కూడా రీమేక్ చేసే అవకాశం వస్తుంది. అయితే వాసు చేసిన సినిమా బెంగాలీ రచయిత శ్యామ్ సింగరాయ్ (నాని) కథల నుంచి కాపీ కొట్టాడంటూ కాపీ రైట్ కేసు పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు కాపీ కొట్టాల్సిన అవసరం వాసుకు ఎందుకు వచ్చింది అనేది అసలు కథ..
కథనం:
తెలుగు ఇండస్ట్రీకి పునర్జన్మల కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. నాని శ్యామ్ సింగరాయ్ ఈ కాన్సెప్ట్ తోనే వచ్చింది. రెండు జన్మలకు ముడిపెడుతూ కథను అందించాడు సత్యదేవ్ జంగా. ఫస్టాఫ్ వరకు పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టాడు శ్యామ్ సింగరాయ్. కీలకమైన సెకండాఫ్ మాత్రం స్లో నెరేషన్ కారణంగా నిరాశ పరిచింది. పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనుకున్న కథే భారంగా ముందుకు సాగింది. రెండు జన్మలకు పర్ఫెక్ట్ సింక్ కుదిరింది అంటే.. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ శ్యామ్ సింగరాయ్ సినిమా విషయంలో అది మిస్ అయినట్లు అనిపించింది. సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు చాలా వేగంగా అయిపోయింది. సెకండాఫ్ అదే జోరు కనిపించి ఉంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యుండేది. మెయిన్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సరైన సన్నివేశాలు పడలేదు. నాని, సాయి పల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నా అప్పటికే ఆలస్యం అయింది. సెకండాఫ్‌లో కాళికాదేవి దగ్గర వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. సినిమా హైలైట్ సన్నివేశాల్లో అది కూడా ఒకటి. ఆ ఒక్క సీన్ మినహాయిస్తే సెకండ్ హాఫ్ లో ఆహా అనిపించే సన్నివేశాలు తక్కువే. 1970ల్లో సాగే కథ కావడంతో దానికి తగ్గట్లుగా వచ్చే సీన్స్ కొన్ని బాగున్నాయి. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్షన్ వర్క్ బాగుంది. కీలకమైన సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్లే సమయంలో కొన్ని సన్నివేశాలు బాగా బోరింగ్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత శ్యామ్ సింగరాయ్ కారెక్టర్ ఇంట్రడక్షన్ కోసమే చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు రాహుల్. మరోవైపు సాయి పల్లవి నుంచి ఊహించిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపించదు. ఆమె తనవంతు బాగానే చేసినా కూడా పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. ఒకట్రెండు సన్నివేశాల వరకే ఆమె పరిమితం అయిపోయింది. ఓవరాల్‌గా కాస్త సోషల్ మెసేజ్ ఉన్నా కూడా స్లో నెరేషన్ శ్యామ్ సింగరాయ్ ఫ్లో దెబ్బ తీస్తుంది.
నటీనటులు:
నాని మరోసారి నాచురల్ యాక్టింగ్ తో మాయ చేసాడు.. ఏ క్యారెక్టర్ అయినా ఆయనకు కొట్టినపిండి అంతే. సాయి పల్లవిని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ఉన్నంత వరకు బాగానే చేసింది. ముఖ్యంగా ఆమె డాన్స్ సినిమాకు హైలైట్. మరో హీరోయిన్ కృతి శెట్టి పర్లేదు. ఫస్టాఫ్‌లో హాట్ సీన్స్ కూడా చేసింది కృతి. చాలా రోజుల తర్వాత దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నటుడిగా ఆకట్టుకున్నాడు. అభినవ్ గోముటం కాస్త కామెడీ పండించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీమ్:
మిక్కీ జే మేయర్ పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే నెలరాజుకు ఇలరాణికి పాట చాలా బాగుంది. దాంతో పాటు ఆర్ఆర్ కూడా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. సినిమా బడ్జెట్ అక్కడే కనిపిస్తుంది. ఎడిటింగ్ సెకండాఫ్ వీక్ అనిపించింది. అందులో దర్శకుడి పని తీరు కూడా లోపించిందేమో అనిపిస్తుంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెలిసిన కథను.. ఆసక్తికరంగా చెప్పడానికి తన శక్తిమేరకు ప్రయత్నించాడు. కానీ సత్యదేవ్ జంగా ఇచ్చిన కథను ఇంతకంటే బాగా డిజైన్ చేయడం కష్టమే అనిపిస్తుంది. మెయిన్ కారెక్టర్ వచ్చే సెకండాఫ్‌పై ఇంకాస్త ఫోకస్ చేసుంటే చాలా బాగుండేది.
చివరగా ఒక్కమాట:
ఓవరాల్‌గా.. శ్యామ్ సింగరాయ్.. యావరేజ్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా..
రేటింగ్: 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Movie reviews, Shyam Singha Roy Movie Review, Telugu Cinema, Tollywood