బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై రోజూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. ఆయనేమైనా హత్య చేయబడ్డాడా.. బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు.. అతడిపై మీడియా ఎందుకు ఇంతగా ప్రేమ చూపిస్తుందో తెలియడం లేదు.. ఇవన్నీ ఓ రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటలు.. శివసేన నేన సంజయ్ రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఇండస్ట్రీ కొందరి గుప్పిట్లోనే ఉందనే భ్రమలు ప్రేక్షకుల్లోకి ఎందుకు పంపిస్తున్నారు.. అలా అయితే రోజుకు ఇద్దరు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా అని రౌత్ ప్రశ్నించాడు.
క్రికెట్, రాజకీయాలు సహా ఏ రంగంలోనైనా బంధుప్రీతి ఉంటుందని ఆయన చెప్తున్నాడు. కేవలం సినిమాలకే దాన్ని ఆపాదించడం సరికాదన్నాడు సంజయ్. ఎవరు ఏ రంగంలో ఉంటే పైకి రావడానికి అంతగా ప్రయత్నించాలని.. చావు దేనికి పరిష్కారం కాదని ఆయన తెలిపాడు. సుశాంత్ మరణాన్ని మీడియా వేడుక చేసుకుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఓ రైతు లేదంటే సైనికుడు మరణిస్తే ఇదే తరహా కవరేజ్ ఎందుకు ఇవ్వడం లేదని మీడియాను ప్రశ్నించాడు ఈయన.
సుశాంత్ మరణంపై చేసిన ప్రచారాన్ని ఇంక ఆపాలని.. ఇప్పటికే చాలా రాద్ధాంతం చేసారని ఆయన చెప్పాడు. ఇదే కొనసాగితే మరికొన్ని ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందేమో అనే భయం వేస్తుందని చెప్పాడు సంజయ్. సుశాంత్ చనిపోయే ముందు కొన్ని రోజులుగా ఒంటరిగా మిగిలాడని.. డిప్రెషన్‌కు లోనై.. ఇండస్ట్రీలో ఎదగడం లేదనే ఆందోళనతో బాంద్రా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన గుర్తు చేసాడు.
సుశాంత్ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపాడని.. ఆయన దగ్గర డబ్బుకు కూడా కొదవలేదనే విషయాన్ని మీడియా గుర్తుంచుకోవాలని ఆయన చురకలంటించాడు. సుశాంత్ మరణం తర్వాత కంగనా రనౌత్, సోను నిగమ్ లాంటి వాళ్లు గొంతెత్తడం గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవాడు మెల్లగా రాణిస్తూ ఏదో ఓరోజు పైకి వస్తాడని ఆయన తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Sanjay Raut, Shiv Sena, Sushanth singh Rajputh