నాగ చైతన్య ఏంటి.. మురళీ మోహన్‌ను ఇల్లు అడగడం ఏంటి.. ఇదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? ఇప్పుడు సమంతతో కలిసి నాగ చైతన్య ఉంటున్న ఇల్లు మురళీ మోహన్‌దే. ఆయన దగ్గర్నుంచే చైతూ కొన్నాడు. అయితే దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. పెళ్లి తర్వాత ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకోవాలని తిరుగుతున్న సమయంలో చాలా ఇళ్లు చూసిన చైతూకు ఒక్కటి కూడా నచ్చలేదు. ప్రతీ ఇంట్లో ఏదో ఓ సమస్య కనిపిస్తూనే ఉండటంతో విసిగెత్తిపోయాడు నాగ చైతన్య. అలాంటి సమయంలో మురళీ మోహన్ ఇల్లు చూసాడు.. అది ఆయనకు బాగా నచ్చేసింది. వెంటనే వెళ్లి అంకుల్ ఇది నాకు కావాలని చైతూ అడిగేసాడు.
అయితే మురళీ మోహన్ మాత్రం ఇది అమ్మడానికి కాదు బాబు.. తనకు, తన కొడుకు, తన తమ్ముడి కోసం ప్రత్యేకంగా కట్టుకున్నామని చెప్పాడు. అయితే ఇల్లు బాగా నచ్చడంతో వెంటనే ఇంటికి వెళ్లి నాగార్జునకు విషయం చెప్పాడు చైతూ. అంతే వెంటనే నాగ్ రంగంలోకి దిగాడు. సిటీలో ఎన్నో ఇల్లు చూసిన చైతూకు మీ ఇల్లు మాత్రమే బాగా నచ్చింది.. ఓసారి చూడండి మురళీ మోహన్ గారూ అంటూ నాగ్ చెప్పడంతో ఆయన కూడా మనసు మార్చుకున్నాడు. నాగార్జున కుటుంబంతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని.. ఇద్దరం కలిసి చాలా సినిమాలు కూడా చేసామని చెప్పాడు మురళీ మోహన్.
ఇంటికి వెళ్లి బాబు చెప్పినట్లున్నాడు అందుకే వెంటనే నాగార్జున కూడా తనకు ఫోన్ చేసి విషయం చెప్పాడని గుర్తు చేసుకున్నాడు ఈయన. చైతూ ఇష్టాన్ని కాదనలేక.. తన కొడుకు మరో ఇంటికి మారిపోయాడని.. దాంతో తన కొడుకు కోసం కట్టిన ఫ్లాట్‌ను చైతూకు ఇచ్చేసానని చెప్పాడు మురళీ మోహన్. 14వ ఫ్లోర్‌లో పూర్తిగా సౌకర్యాలతో ఉండే ఈ ఇంటిని మనసు పడి మరీ కొనుక్కున్నాడు చైతూ.
ప్రస్తుతం అక్కడే సమంతతో కలిసి ఉంటున్నాడు నాగ చైతన్య. ఆ పక్కనే మురళీ మోహన్.. ఆయన తమ్ముడు కూడా ఉంటున్నారు. అందులోనే జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. మొత్తానికి తనకోసం కట్టుకున్న ఇంటిని నాగ చైతన్య వచ్చి అడగడం.. మురళీ మోహన్ కాదనడం.. నాగార్జున రంగంలోకి దిగి ఇప్పించడం అలా జరిగిపోయాయంతే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Murali Mohan, Naga Chaitanya, Nagarjuna Akkineni, Samantha akkineni, Telugu Cinema, Tollywood