Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 23, 2020, 10:36 PM IST
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ పూర్తి చేసిన సూపర్ స్టార్ ఇప్పుడు మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు. అందులో మొదటిది పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు కూడా ఈ మధ్యే లాంఛనంగా మొదలయ్యాయి. ఎప్పట్లాగే పూజకు మహేష్ బాబు రాలేదు. అది ఆయన సెంటిమెంట్. ఈ చిత్రం ఆర్థిక నేరాల చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది. రెండేళ్ల పాటు కథను పక్కాగా సిద్ధం చేసాడు పరశురామ్. స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా కుదిరింది అంటున్నాడు ఈయన. మరోవైపు మహేష్ బాబు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని.. కచ్చితంగా ఆయన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా చేస్తానంటున్నాడు పరశురామ్. గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించబోతుంది.

సితార చేతులు మీదుగా ప్రారంభమైన ‘సర్కారు వారి పాట’ పూజా కార్యక్రమాలు (Twitter/Photo)
బ్యాంకులకు కోట్లకు కోట్లు టోకరా పెట్టిన కొందరు ఆర్థిక నేరగాళ్ల జీవితాల నుంచి స్పూర్థి పొంది ఈ కథను పరశురామ్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్‌గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ కెరీర్లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్‌గా నిలిచిన ఒక్కడుకు మించి ఇది ఉండబోతుందని ఇప్పటి నుంచే అంచనాలు పెంచేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. ఈ మధ్య వరసగా కమర్షియల్ సినిమాలతో పాటు అందులోనే సందేశం కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు మహేష్ బాబు.

అనిల్ కపూర్, మహేష్ బాబు సర్కారు వారి పాట (mahesh babu anil kapoor)
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు అలా వచ్చినవే. ఇప్పుడు సర్కారు వారి పాట కూడా అలాగే ఉండబోతుంది. 2021 ఆగస్ట్, సెప్టెంబర్‌లోపు షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్లో కానీ లేదంటే 2022 సంక్రాంతికి కానీ విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినా కూడా కొన్ని అనివార్య కారణాలతో సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పుడు మాత్రం మహేష్ బాబు పూర్తి ఫోకస్ సర్కారు వారి పాట సినిమాపైనే ఉంది. మరి అంతగా ఊరిస్తున్న ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 23, 2020, 10:36 PM IST