సంక్రాంతి వస్తుందంటే చాలు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైపోతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. సంక్రాంతి 2020కి ఇప్పట్నుంచే పోటీ మొదలైపోయింది. ఇప్పటికే బన్నీ, మహేష్ తమ సినిమాలను లైన్‌లో ఉంచేసారు. నందమూరి కళ్యాణ్ రామ్ తాను నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాను పండక్కే విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాను సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో పాటు రజినీకాంత్ కూడా ఇప్పుడు దర్బార్ సినిమాతో సంక్రాంతికే వస్తానని కన్ఫర్మ్ చేసాడు.
పేట సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చాడు రజినీ. ఇక ఎంత మంచివాడవురా దర్శకుడు సతీష్ వేగేశ్నకు సంక్రాంతి పండగ సెంటిమెంట్. తన కెరీర్‌ను మార్చేసిన శతమానం భవతి పండక్కే వచ్చింది. 2017లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయంతో పాటు నేషనల్ అవార్డ్ కూడా తీసుకొచ్చింది. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తర్వాత సతీష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీనిపై ఆసక్తి బాగానే ఉంది. ఈ సినిమాను సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలతో పోటీకి దించుతున్నాడు కళ్యాణ్ రామ్.
జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. జనవరి 12న అల వైకుంఠపురములో విడుదల కానున్నాయి. జనవరి 14న దర్బార్ విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మరుసటి రోజు కళ్యాణ్ రామ్ వస్తున్నాడు. 2019 సంక్రాంతికి కథానాయకుడు, పేట, వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమాలు విడుదలైతే అందులో ఒక్కటే హిట్ అయింది. ఈ సారి కూడా నాలుగు సినిమాలు వస్తున్నాయి. పైగా రజినీకాంత్ మళ్లీ వస్తున్నాడు.
సంక్రాంతికి వచ్చే ఏ సినిమాను కూడా ఎప్పుడూ లైట్ తీసుకోకూడదు. చాలా ఏళ్ళుగా చిన్న సినిమాలే సంచలన విజయాలు సాధిస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా కళ్యాణ్ రామ్ కచ్చితంగా పండక్కి మాయ చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. మరోవైపు మహేష్, బన్నీ, రజినీకాంత్ మధ్య కూడా వార్ రసవత్తరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Darbar, Kalyan Ram Nandamuri, Mahesh Babu, Rajinikanth, Telugu Cinema, Tollywood