సంక్రాంతి సందడి మరికొద్ది గంటల్లో మొదలు కానుంది. నిర్మాతల మధ్య మాటలయుద్ధంతో ఇప్పటికే ఈ సంక్రాంతిపై ఎక్కడలేని ఆసక్తి వచ్చేసింది. ఇప్పుడు నిర్మాతలు కాదు వాళ్ళు చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాట్లాడానున్నాయి. జనవరి 9న ‘కథానాయకుడు’ సినిమాతో సంక్రాంతి మొదలు కానుంది. మరికొద్ది గంటల్లో ‘కథానాయకుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాలుగు సినిమాల సెన్సార్ రిపోర్ట్ చూసిన తర్వాత వీటిలో ఏది విజయం సాధిస్తుందని చెప్పడం కష్టంగా మారింది.
ఒక్కో సినిమా దాదాపు రెండున్నర గంటలు.. అంతకంటే మించి రన్ టైమ్ తోనే వస్తున్నాయి. పండగ సినిమాల్లో అన్నింటికంటే ముందు వస్తున్న ‘కథానాయకుడు’ రెండు గంటల 51 నిమిషాల నిడివితో వస్తుంది. ఎన్టీఆర్ చరిత్ర కాబట్టి ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ కాకుండా సినిమా చూస్తారు అంటున్నాడు క్రిష్. దానికి తోడు సినిమాలో దివిసీమ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని.. సినిమా చూసిన తర్వాత దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారని ధీమాగా చెబుతున్నారు ఈ దర్శకుడు.
ఈ సినిమా తర్వాత జనవరి 10న ‘పేట’ రెండు గంటల యాభై నిమిషాల నిడివితో వస్తుంది. ఎంత రజినీకాంత్ అయినా కూడా స్క్రీన్ ప్లే గాడి తప్పితే అసలుకే మోసం వస్తుంది. సంక్రాంతి నాలుగు సినిమాల్లో అతి తక్కువ థియేటర్స్‌లో విడుదల అవుతున్న సినిమా ఇదే. జనవరి 11న ‘వినయ విధేయ రామ’ రానుంది. ఈ చిత్రం 2 గంటల 28 నిమిషాల రన్ టైంతో వస్తుంది. రెండున్నర గంటలు అనేది తెలుగు సినిమాకు ఐడియల్ రన్ టైమ్. ఇప్పుడు కూడా బోయపాటి ఇదే చేశాడు.
యాక్షన్ సీన్స్ మరో రేంజ్లో ఉంటాయని.. చరణ్ మాస్ ఇమేజ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతారంటున్నాడు బోయపాటి శ్రీను. జనవరి 12న చివరగా వెంకటేష్, వరుణ్ తేజ్ సంక్రాంతి పండుగను నవ్వులతో ముగించనున్నారు. వీళ్లు నటించిన ‘ఎఫ్2’ సినిమా అన్ని సినిమాల కంటే చివరలో వస్తుంది. ఇది కూడా 2 గంటల 26 నిమిషాలతో వస్తుంది.
ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా బాగుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కడుపులు చెక్కలయ్యేలా నవ్వించింది. దాంతో సినిమాపై నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఈ నాలుగు సినిమాల్లో రెండు భారీ నిడివి.. రెండు రెండున్నర గంటల నిడివితో వస్తున్నాయి. మరి వీటిలో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Rajinikanth, Ram Charan, Telugu Cinema, Tollywood, Varun Tej, Venkatesh