డ్రగ్స్ కేసులో కన్నడ పరిశ్రమ మునిగిపోతుంది. చాలా మంది ఈ రాకెట్‌లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు కూడా. రాగిణి ద్వివేదితో పాటు సంజన గిల్రానీ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ఇంకా తీగ కదిపితే డొంకంతా బయటికి వచ్చేలా కనిపిస్తుంది. అందుకే పోలీసులు కూడా ఇదే పని చేస్తున్నారు. దొరికిన తోకను పట్టుకుని మెల్లగా ఒక్కొక్కరిని బయటికి లాక్కుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే సీసీబీ పోలీసులు దర్యాప్తులో మరింత మంది నటులు వెలుగులోకి వస్తున్నారు. కన్నడ స్టార్ జోడీ దిగంత్, ఐంద్రితా రేకు సీసీబీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. వీళ్లను సెప్టెంబర్ 16 ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ ఫాజిల్.. శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు వీళ్లని ఆహ్వానించిన వీడియో వైరల్ అయ్యింది.
దీంతో తాజాగా వీళ్లకి నోటీసులు జారీ అయ్యాయి. దిగంత్, నటి ఐంద్రితా రేకు సీసీబీ తాజా నోటీసులతో కన్నడ చిత్రసీమలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే ఇదే కేసులో ఎ-6 అయిన ఆదిత్య అల్వా రిసార్ట్‌పై ఈ ఉదయం సీసీబీ పోలీసులు దాడి చేశారు. మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడైన ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మాదకద్రవ్యాల కేసులో రాగిణి, సంజన ఇప్పటికే అరెస్టు అయ్యారు. రాగిణికి 14 రోజుల జైలు శిక్ష విధించారు. సంజన గల్రానీని సీసీబీ పోలీసులు మూడు రోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమను చూస్తుంటే అసలు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs racket, Kannada Cinema