Samantha: అవును సమంత అక్కినేని తొలిసారి పౌరాణిక పాత్రలో నటిస్తోంది. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కొత్త యేడాది సందర్బంగా ప్రకటించింది. సమంత విషయానికొస్తే.. ‘ఏమాయ చేసావే’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తన తొలి చిత్ర హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్.. మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతుంది. అక్కినేని హీరోలు హిట్టు కోసం ముఖం వాచిపోతుంటే.. సమంత మాత్రం వరుస సక్సెస్‌లతో దూసుకుపోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి.. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. ఇప్పటికే చిరంజీవి, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రానా వంటి వాళ్లను ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో వెరైటీగా ఇంటర్వ్యూలు చేస్తోంది.
సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె గతేడాది శర్వానంద్‌తో కలిసి నటించిన 'జాను' సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. త్వరలో సామ్.. ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తాజాగా సమంత.. గుణశేఖర్ ప్రకటించిన ‘శాకుంతలం’లో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో శకుంతల పాత్రలో అలరించనుంది. ఒక రకంగా సమంత కెరీర్లో తొలి పౌరాణిక సినిమా. ఈ సినిమాను మహాభారతంలోని ఆదిపర్వం మూలం. ఈ సినిమాను గుణశేఖర్ శకుంతల, దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మహాకవి కాళిదాసు రాసిన శాకుంతలం నాటకం .. వెస్ట్రన్ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది. ఈ సినిమాలో శకుంతలగా సమంత ఫైనల్ కాగా.. దుష్యంతుడుగా ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే ఈ స్టోరీతో రెండు సినిమాలు తెలుగులో వచ్చాయి. ఒకటి ఎన్టీఆర్, బి.సరోజా దేవి హీరో, హీరోయిన్లుగా ‘శకుంతల’ పేరుతో కమలకర కామేశ్వరరావు తెరకెక్కించారు. ఆ తర్వాత చాలా యేళ్ల తర్వాత ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించాడు. అందులో ఓ భాగంగా శకుంతల, దుష్యంతుల ప్రణయ గాథ ఉంటుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ దుష్యంతుడిగా నటించారు. ఆ సంగతి పక్కన పెడితే... గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దుష్యంతుడితో పాటు కణ్వ మహర్షి, విశ్వామిత్రుడు, మేనక వంటి పాత్రలను ఎవరు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు గుణశేఖర్.
గతంలో గుణశేఖర్ అంతా చిన్నపిల్లలతో ఎన్టీఆర్ హీరోగా ‘రామాయణం’ అనే పౌరాణిక సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా.మరోవైపు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత ‘హిరణ్యకశ్యప’ సినిమాను రానాతో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా తెరకెక్కడానికి మరింత సమయం ఉండటంతో ముందుగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గుణశేఖర్ తన స్వీయ నిర్మాణంలో గుణ టీమ్ వర్క్స్‌లో తెరకెక్కిస్తున్నాడు. మొత్తంగా సమంత రాకతో ‘శాకుంతలం’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gunasekhar, Samantha akkineni, Shakuntalam Movie, Tollywood