పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ సమంత అక్కినేని. ఇప్పటికీ ఈ బ్యూటీ కోసం కథలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇదివరకటి మాదిరి గ్లామర్ పాత్రలు చేయడం లేదు కాబట్టి మంచి మంచి రోల్స్ అన్ని సమంత అక్కినేని కోసం క్యూ కడుతున్నాయి. మరీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథలకు ఈమె కేరాఫ్ అడ్రస్ అవుతుంది. యూ టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలతో తనను తాను నిరూపించుకుంది సమంత. దాంతో ఈమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఓ బయోపిక్‌లో సమంత నటించేందుకు సిద్దమవుతోందని ప్రచారం జరుగుతుంది.
ముందు ఈ చిత్రంలో అనుష్క పేరు వినిపించినా కూడా ఇప్పుడు సమంత చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, బెంగళూరు నాగరత్నమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పాత్రల ఎంపిక ప్రస్తుతం జరుగుతుంది. ఈ క్రమంలోనే నాగరత్నమ్మ పాత్ర కోసం సమంతను అడుగుతున్నారు దర్శక నిర్మాతలు. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం సమంతకు నిజంగానే ఈ పాత్ర ఓ ఛాలెంజింగ్ అవుతుంది.
ఇప్పటికే గత రెండేళ్లలో మహానటి, ఓ బేబీ, మజిలీ లాంటి సినిమాలతో తనలోని నటికి పని చెప్పింది స్యామ్. ఇప్పుడు మరోసారి ఈ పాత్రలో నటించబోతుంది. దేవదాసీగా పుట్టి సంగీత కళాకారిణిగా ఎదిగి జీవిత చరమాంకంలో యోగినిగా మారింది నాగరత్నమ్మ. తను సంపాదించిన మొత్తాన్ని కళలకు, కళాకారులకు ధారపోసింది ఈమె. అలాంటి పాత్రకు సమంతను తీసుకుంటే సంచలనమే. మరి చూడాలిక.. ఈ కారెక్టర్‌లో అక్కినేని కోడలు ఎంతవరకు మాయ చేస్తుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood