పెళ్లికి ముందు కంటే కూడా తర్వాత నాగ చైతన్య ఇమేజ్ బాగా పెరిగిపోయింది. అదేం విచిత్రమో కానీ పెళ్లి తర్వాత చైతూ విజయాలు కూడా పెరిగాయి. ఇక సమంత అక్కినేని అయితే ఎప్పట్నుంచో తన ఇమేజ్ కొనసాగిస్తుంది. ఇప్పటికీ వరస విజయాలు అందుకుంటూనే ఉంది. పెళ్లై రెండేళ్లైనా కూడా ఇప్పటికీ ఈమె వరస సినిమాలు చేస్తూనే ఉంది. దర్శక నిర్మాతలు కూడా సమంత డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో చైస్యామ్ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరూ త్వరలోనే ఓ నిర్మాణ సంస్థను మొదలుపెట్టాలని చూస్తున్నారు. దీనికి పేరు కూడా రిజిష్టర్ చేసారు. ANS ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ స్థాపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే దీనిపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పిల్లల గురించి అయితే ఈ జంట ఆలోచించడం లేదు. తనకు పిల్లలు కావాలనుకున్నపుడు కెరీర్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇస్తానని చెప్పింది సమంత. మరోవైపు చైతూ కూడా సమంత నిర్ణయానికి గౌరవం ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇద్దరూ కలిసి సొంత నిర్మాణ సంస్థపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. భర్త నాగచైతన్యతో కలిసి సినిమాలు నిర్మిస్తానని సమంత ఇదివరకే ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈ సమ్మర్‌లోనే కొత్త ప్రొడక్షన్ హౌజ్ లాంఛ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో కొందరు చెబుతున్న మాట.
ఇందులో చైతూ, స్యామ్ కలిసి తొలి సినిమాలో నటిస్తారని కొందరు చెబుతుంటే.. కాదు ఓ చిన్న సినిమాతో బ్యానర్ మొదలుపెడుతున్నారని ఇంకొందరు చెప్తున్నారు. ఏదేమైనా కూడా సమంత, చైతూ నిర్మాతలుగా మారడం మాత్రం ఖాయం. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి నిర్మించడానికి చైస్యామ్ రెడీ అయిపోయారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఉండగానే మరో నిర్మాణ సంస్థ మొదలుపెట్టడంపై నాగార్జున కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Samantha, Telugu Cinema, Tollywood