Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 1, 2019, 8:04 PM IST
పూజా డడ్వాల్ ఫైల్ ఫోటో
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పడం కష్టం. ఒకప్పుడు రాణిలా బతికిన వాళ్లు కూడా చివరికి ఏం లేకుండా పోతారు. ఒకప్పుడు చాలా మంది హీరోయిన్లు దీనికి నిదర్శనం కూడా. అయితే ఇప్పుడు కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్‌కు ఇలాంటి కష్టాలే వచ్చాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈమె.. ఇప్పుడు డబ్బుల్లేక టిఫిన్ సెంటర్ నడుపుకుంటుంది. దాదాపు 24 ఏళ్ల కింద అంటే 1995లో వచ్చిన వీర్‌ఘటి సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించిన పూజా డడ్వాల్ ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈమె పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

పూజా డడ్వాల్ సల్మాన్ ఖాన్
పేరుకు ఒకప్పటి హీరోయిన్ అయినా కూడా ఇప్పుడు కనీసం సినిమాలు కాదు కదా చేతిలో చిల్లిగవ్వ లేక టిఫిన్స్ అమ్ముకుంటుంది. అవకాశాల మాట దేవుడెరుగు ముందు బతికితే చాలు అనే దీనస్థితికి వెళ్లిపోయింది పూజా. కొన్ని నెలల క్రితం క్షయవ్యాధితో బాధపడుతూ డబ్బుల్లేక దిక్కులేని స్థితిలో హాస్పిటల్లో పడి ఉన్న ఈమెను చూసి సల్మాన్ ఖాన్ చలించిపోయాడు. వెంటనే ఆమెకు ఆమె చికిత్సకు ఆర్థిక సాయం చేసాడు కండలవీరుడు. ఆ తర్వాత ఆమె కోలుకుంది. బాగైన తర్వాత సినిమాలు వస్తాయేమో అనుకున్న పూజాకు ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు.. కనీసం ఈమె ఉన్నట్లు కూడా ఎవరికి గుర్తు లేదు. దాంతో బతుకు తెరువు కోసం ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతుంది ఈమె.

పూజా డడ్వాల్ సల్మాన్ ఖాన్
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్న కొందరు స్నేహితులను కలిసి పని కావాలని అడుగుతున్నట్లు చెప్పింది. వాళ్లు కూడా సానుకూలంగానే స్పందించారని.. కచ్చితంగా సాయం చేస్తామని చెప్పినట్లు గుర్తు చేసుకుంది పూజా. అయితే తనకు జాలి అవసరం లేదని.. సినిమాల్లో మళ్లీ అవకాశం ఇప్పిస్తే చాలని చెబుతుంది. తాను మంచి నటిని అని.. ఆ విషయం గుర్తించుకుని ఇప్పటికీ ఆఫర్లు ఇస్తే నటించే సత్తా తనలో ఉందని చెబుతుంది ఈమె. తన గురించి తెలిసి కొందరు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిసింది.. అయితే అలాంటి వాళ్లు తనకు అవకాశం ఇస్తానని ఆశిస్తున్నట్లు చెబుతుంది పూజా.

పూజా డడ్వాల్ సల్మాన్ ఖాన్
కానీ ఇప్పటి వరకు అయితే ఏ ఒక్కరు కూడా అవకాశం అయితే ఇవ్వలేదు.. వస్తుందనే నమ్మకం ఉందని.. ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని.. ఆ సమయంలో పొట్ట నింపుకోవడానికి ఏం చేయాలో తెలియక తన స్నేహితుడు, దర్శకుడు రాజేంద్ర సింగ్ ఇచ్చిన సలహాతో టిఫిన్ సెంటర్ పెట్టుకున్నానని చెప్పింది. తనకు దేవుడిపై నమ్మకం ఉందని.. ఏదో ఒక రోజు కచ్చితంగా మళ్లీ తనకు సినిమాల్లో అవకాశం వస్తుందని ఆశిస్తుంది పూజా. తన చికిత్స కోసం సాయం చేసిన సల్మాన్‌ను ఓ సారి కలిసి మనసారా ధన్యవాదాలు చెప్పుకోవాలని ఉందని.. ఆయన తనకు దేవుడితో సమానమని చెబుతుంది పూజా డడ్వాల్.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 1, 2019, 8:04 PM IST