ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత 50 రోజుల్లోపే ఒరిజినల్ ప్రింట్ కూడా విడుదల చేస్తున్నారు. మరీ ఈ ఏడాది అయితే అది కూడా లేదు. నేరుగా సినిమాను ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తున్నారు. చాలా సినిమాలు 2020లో ఓటిటి వేదికగా విడుదలయ్యాయి. అందులో కొన్ని సత్తా చూపించాయి కూడా. అయితే అదే సమయంలో వి, నిశ్శబ్ధం లాంటి భారీ సినిమాలు నిరాశ పరిచాయి. ఇదిలా ఉంటే కరోనా బెదిరిస్తున్నా కూడా ధైర్యంగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. తొలిరోజు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 4 రోజులకు 12 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. అయితే సాధారణంగా మన సినిమాలకు వచ్చే వసూళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. సగం టికెట్స్ మాత్రమే అమ్మడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటితోనే ఇన్ని కోట్లు వసూలు చేసింది. అయితే థియేటర్స్‌లో విడుదల చేయడానికి ముందుగానే నిర్మాతలతో జీ స్టూడియోస్ ఓటిటి సంస్థ ఒప్పందం పూర్తి చేసుకుంది. థియేటర్స్‌లో విడుదలైన తర్వాత ఒకవేళ కలెక్షన్స్ సరిగ్గా రాకపోతే మాత్రం వెంటనే ఓటిటిలో విడుదల చేయొచ్చనేది ఈ అగ్రిమెంట్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే 35 కోట్లకు పైగా ఈ సినిమా డీల్ క్లోజ్ అయింది.
ఇప్పుడు అనుకున్నట్లుగానే సినిమా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది. అయితే వారం రోజుల్లోనే పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్‌కు రావడం కష్టమే కాబట్టి జనవరి 1న ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. జీ స్టూడియోస్‌లో ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చు. అయితే దాన్ని సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మరోవైపు డిష్ టివి, మిగిలిన శాటిలైట్‌లో కూడా సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.
దానికోసం 146 రూపాయలు చెల్లించాలి. అలాంటి పద్దతిలోనే జనవరి 1న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ నిజమైతే విడుదలైన వారం రోజుల్లోనే డిజిటల్‌లో వచ్చిన తొలి సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది సోలో బ్రతుకే సో బెటర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Solo Brathuke So Better, Telugu Cinema, Tollywood