ఎప్పుడూ గెలిచేవాడు గెలిస్తే పెద్ద న్యూస్ కాదు.. కానీ ఓడిపోయేవాడు గెలిస్తే హిస్టరీ అవుతుంది.. ఇదే లైన్‌తో కిషోర్ తిరుమల చేసిన సినిమా చిత్రలహరి. ఒక్కటి రెండు కాదు.. ఆరు ఫ్లాపులతో పూర్తిగా రేసులో వెనకబడిపోయిన సాయి ధరమ్ తేజ్‌తో ఈ సినిమా చేసాడు కిషోర్. అప్పటికి సాయి ఉన్న పరిస్థితి కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. నిజంగానే ఫెయిల్యూర్స్‌లో ఉన్న మెగా మేనల్లుడు ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత మంచి విజయం అందుకున్నాడు. సున్నితమైన కథలను.. అద్భుతమైన ఎమోషన్స్‌తో తెరకెక్కిస్తాడని దర్శకుడు కిషోర్ తిరుమలకు పేరుంది.
నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాల తర్వాత కిషోర్ తిరుమల నుంచి వచ్చిన సినిమా ఇది. ముందు నుంచి కూడా మంచి అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రం అనుకున్నట్లుగానే స్లీపర్ హిట్ అయింది. ఫెయిల్యూర్ అంటూ సక్సెస్ అందుకున్న కథ ఇది. నూటికి 90 మంది ఇలాగే ఉంటారు.. ప్రయత్నిస్తూనే ఉంటారు.. అలాంటి వాళ్లపైనే కిషోర్ తిరుమల ఫోకస్ చేసాడు. సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోను ఈ కథకు సెలెక్ట్ చేసుకున్నపుడే దర్శకుడు విజయం సాధించాడు.. ఆ తర్వాత పని మరింత ఈజీ అయిపోయింది.
సింపుల్ కథ.. అందమైన స్క్రీన్ ప్లే.. అలరించే సంగీతం.. అన్నీ కలిపి చిత్రలహరికి మంచి విజయం తీసుకొచ్చాయి. ఈ సినిమా వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. 2019, ఎప్రిల్ 12న చిత్రలహరి విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్ కీలక పాత్ర పోషించాడు. చీకటి తప్ప వెలుగు లేని ఓ కుర్రాడి కథ ఇది.. అలాంటి వాడి జీవితంలోకి గెలుపు అనే వెలుగు ఎలా వచ్చిందనే విషయాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు కిషోర్ తిరుమల. ఈ సినిమా ఏడాది పూర్తి చేసుకోవడంతో మరోసారి చిత్రలహరి గుర్తులను నెమరేసుకుంటున్నారు ఈ యూనిట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kishore Tirumala, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood