ఒక్కటి రెండు కాదు.. వరసగా ఆరు ఫ్లాపులతో దారుణంగా వెనకబడిపోయాడు సాయి ధరమ్ తేజ్. అసలు ఆయన కెరీర్‌పై ఆయనే సెటైర్లు వేసుకుంటున్నాడు ఇప్పుడు. ఇలాంటి సమయంలో చిత్రలహరి సినిమాతో వస్తున్నాడు సాయి. కానీ ఇన్ని ఫ్లాపులు భయపెడుతున్నా.. ఒక్క పాజిటివ్ సెంటిమెంట్ మాత్రం ఆయనకు వరంగా మారుతుంది. ఆ ఒక్కటే తనకు హిట్ తీసుకొస్తుందని నమ్ముతున్నాడు సాయి. దీనిపైనే ఇప్పుడు ఆయన ఆశలు పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసా..? కిషోర్ తిరుమలతో సినిమా చేయడమే.
దీనికి ముందు ఈయన రామ్ హీరోగా వరసగా రెండు సినిమాలు చేసాడు. నేను శైలజ చేసే టైమ్‌కు రామ్ కెరీర్ దారుణంగా ఉంది. ఒక్క హిట్ అంటూ ఆయన వేచి చూస్తున్నాడు. ఆ సమయంలో నేను శైలజ విజయం సాధించింది. దీనికి ముందు రామ్ కూడా వరసగా ఐదు ఫ్లాపులు ఇచ్చాడు. ఇక ఇప్పుడు సాయి కూడా ఆరు ఫ్లాపులు ఇచ్చాడు.
ఈ సమయంలో సాయి ధరమ్ తేజ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ వస్తుంది. దాంతో అప్పుడు రామ్ విషయంలో వర్కవుట్ అయిన సెంటిమెంట్ ఇప్పుడు ఈయనకు కూడా వర్తిస్తుందని నమ్ముతున్నారు మెగాభిమానులు. ఒకవేళ ఇదే సెంటిమెంట్ వర్కవుట్ అయితే కచ్చితంగా చిత్రలహరి సంచలనం సృష్టించడం ఖాయం. మరి చూడాలిక.. ఎప్రిల్ 12న విడుదల కానున్న ఈ చిత్రం ఏం మాయ చేస్తుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Pothineni, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood