ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్ అంటే రొటీన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే వరసగా అరడజన్ ఫ్లాపులు ఇచ్చాడు ఈ కుర్ర హీరో. మెగా ఇమేజ్ ఉన్నా కూడా కొన్ని రొటీన్ కథలతో తన ఇమేజ్ తానే పాడు చేసుకున్నాడు. అలాంటి పరిస్థితి నుంచి చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి. అందులో ఫెయిల్యూర్స్ గురించి చెప్పాడు. అప్పటికి సాయి తేజ్ ఉన్న కెరీర్ గ్రాఫ్‌కు ఈ కథ 100 శాతం సరిపోయింది. దాంతో ప్రేక్షకులు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయారు. దానికితోడు చిత్రలహరితో ఓటమి గెలుపుకు తొలిమెట్టు అంటూ చూపించాడు ఈ హీరో.
ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అంటూ వస్తున్నాడు సాయి తేజ్. ఇందులో తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్ గురించి చెప్తున్నాడు దర్శకుడు. ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ చేయనటువంటి కొత్త జోనర్ ఇది. మరోవైపు మారుతికి కూడా ఇది కొత్త కథే. త్వరలోనే ప్రతిరోజూ పండగే విడుదల కానుంది. ఇక ఇప్పుడు కొత్త దర్శకడు సుబ్బుతో సోలో బ్రతుకే సో బెటరూ అంటూ మరో సినిమా మొదలు పెట్టాడు సాయి తేజ్. ఇందులో పెళ్లి అంటే దూరంగా వెళ్లిపోయే పాత్రలో నటిస్తున్నాడు. అమ్మాయిలంటే గౌరవం ఉన్నా కూడా పెళ్లి అంటే నో అనే పాత్ర ఇది.
తనతో పాటు తన చుట్టూ ఉన్న కుర్రాళ్లను కూడా పెళ్లికి నో చెప్పేలా చేసే పాత్ర ఇది. ఇలాంటి కథ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. వాళ్లనే టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాలతో పాటు దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది హై రేంజ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. దేవా సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇప్పుడు సాయితో కూడా ఇలాంటి కథే చేస్తున్నాడు. మొత్తానికి మూసలోంచి బయటికి వచ్చి కొత్త కథలు చేసుకుంటూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు మెగా మేనల్లుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood