రివ్యూ: ‘సాహో’.. యాక్షన్ అదిరింది.. కానీ కానీ కానీ..

సాహో.. సాహో.. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం రెండేళ్లుగా వేచి చూస్తూనే ఉన్నారు. ఇప్పటికి వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ఇప్పుడు విడుదలైంది ఈ చిత్రం. చూసిన తర్వాత వాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. అసలు సినిమా ఎలా ఉందో చూద్దాం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 30, 2019, 1:46 PM IST
రివ్యూ: ‘సాహో’.. యాక్షన్ అదిరింది.. కానీ కానీ కానీ..
సాహో పోస్టర్ Instagram.com/officialsaahomovie
  • Share this:
నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ తదితరులు
సంగీతం: శంకర్ ఎహసాన్ లాయ్

సినిమాటోగ్రఫీ: మధి
ఎడిటర్: శ్రీకర ప్రసాద్
కథ, దర్శకుడు: సుజీత్
నిర్మాతలు: వంశీ ప్రమోద్

సాహో.. సాహో.. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం రెండేళ్లుగా వేచి చూస్తూనే ఉన్నారు. ఇప్పటికి వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ఇప్పుడు విడుదలైంది ఈ చిత్రం. చూసిన తర్వాత వాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. అసలు సినిమా ఎలా ఉందో చూద్దాం..కథ:
వాజీ సిటీలో గ్యాంగ్ స్టర్స్ ఉంటారు. అక్కడ రాయ్ (జాకీ ష్రాఫ్) రాజ్యం నడుస్తుంటుంది. ఆయనకు చాలా మంది శత్రువులు కూడా ఉంటారు. ఓ రోజు అనుకోకుండా రాయ్‌ను అతడి శత్రువులు చంపేస్తారు. అదే సమయంలో ముంబైలో 2 వేల కోట్ల చోరీ జరుగుతుంది. ఆ కేస్ చేధించడానికి వస్తాడు ఆఫీసర్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్). ఆయన టీంలోనే ఉండే మరో ఆఫీసర్ అమృత నాయర్ (శ్రద్ధా కపూర్). కేస్ ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్లకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. తీరా ఇంటర్వెల్ సమయానికి అసలు కథ మొదలవుతుంది. అసలు దొంగతనం ఎవరు చేసారు.. అశోక్ చక్రవర్తి ఎక్కడ్నుంచి వచ్చాడు.. ఆయన స్థానంలో సాహో(ప్రభాస్) ఎలా వచ్చాడు అనేది అసలు కథ. 2 వేల కోట్ల నుంచి దోపిడి కాస్తా 2 లక్షల కోట్ల వరకు ఎలా వెళ్తుంది అనేది అసలు కథ..

కథనం:
సాహో అనే మాటే చాలా గొప్పగా అనిపిస్తుంది. దానికి తగ్గట్లే సినిమా ఉంటుందని ఊహించి వెళ్లిన వాళ్లకు సాహో నిరాశ పరచడం ఖాయం. ఫస్ట్ సీన్ నుంచే అంచనాలు పెంచేయడం మొదలు పెట్టాడు దర్శకుడు. కానీ దానికి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే మాత్రం రాసుకోలేకపోయాడు. ముఖ్యంగా కథ విషయంలో చాలా రొటీన్ తీసుకోవడం సాహోకు మైనస్ అయిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఊహించే సినిమా మాత్రం ఇది కాదేమో అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సుల విషయంలో దర్శకుడు చూపించిన శ్రద్ధ కథ విషయంలో చూపించి ఉంటే సాహో రేంజ్ మరోలా ఉండేదేమో..? ముఖ్యంగా హీరోల చుట్టూ కథ అల్లుకున్నా కూడా సాహో కాస్త బెటర్ అయ్యుండేది అనిపించింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ గురించి ముందు నుంచి కూడా చాలా ఊహలు వచ్చాయి. కానీ అత్యంత క్యాజువల్ గా ఉంది ఈ సీన్. అదే కాదు.. ఫస్టాఫ్ అంతా అలాగే సాగిపోతుంది.. సా.... గిపోతుంది కూడా. సినిమాలో ఉన్న ప్రధాన పాత్రలు అన్నీ ఫస్టాఫ్‌లోనే పరిచయం చేసిన ద‌ర్శ‌కుడు.. వాటి చుట్టూ కథ అల్లడంలో మాత్రం తడబడిపోయాడు. సుజీత్ అనుభవలేమి అక్కడ కనిపించిందేమో అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ బాగున్నా కూడా అప్పటికే ఆ ట్విస్ట్ చాలా మంది ప్రేక్షకులకు ఐడియా వచ్చేస్తుంది. ఎప్పట్నుంచో తెలుగు సినిమాలు చూస్తున్న వాళ్లకు ఈ ట్విస్ట్ అర్థమైపోతుంది. పోకిరి నుంచి వస్తున్న ట్విస్టులే ఇవి. ఇక ఈ సినిమాకు ప్రధాన మైనస్ నేటివిటీ. బాలీవుడ్‌ను ఫోకస్ చేయడంతో ఇక్కడ తేడా కొట్టేసింది. రొమాన్స్‌, కామెడీ, ఎమోష‌న‌ల్‌ సీన్స్‌కు ఈ సినిమాలో అసలు తావే లేదు. రొమాన్స్ అక్కడక్కడా వస్తున్నా కూడా కథలో ఇరికించినట్లు అనిపిస్తాయి. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ బాగానే అనిపించినా.. సెకండాఫ్ మాత్రం మరింత తేలిపోయింది. తెరపై అదిరిపోయే యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నా కూడా హాలీవుడ్ సన్నివేశాలతో పోల్చుకుంటే కాపీ అనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా వరకు అక్కడి సీన్లు తీసుకొచ్చినట్లు కనిపిస్తుంటుంది. అంత బడ్జెట్ పెట్టినా కూడా ఎందుకో కానీ క్వాలిటీ కనిపించలేదు. బడ్జెట్ మాత్రం కనిపించింది.. ప్ర‌భాస్ చాలా తెలివిగా బాహుబలికి వ్యతిరేకంగా మోడ్రన్ యాక్షన్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. కానీ సుజీత్ ఈ కథను మరింత పక్కాగా రాసుకునుంటే బాగుండేది. స్క్రీన్ ప్లే కూడా రేసీగా లేకపోవడంతో సాహో చాలా వరకు మైనస్ అయిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే భరించలేని విధంగా ఉంటాయి. స్క్రీన్‌పై ప్రభాస్ చేసిన కొన్ని స్టంట్స్ అయితే చూడ్డానికి ఇబ్బందిగా అనిపించాయి. క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. మొత్తంగా సాహో అంచనాలతో వెళ్తే నిరాశ తప్పదు.

నటీనటులు:
ప్రభాస్ యాక్షన్ పాత్రలో బాగానే నటించాడు. అయితే స్క్రీన్ పై మరీ లేజీగా కనిపించాడు యంగ్ రెబల్ స్టార్. బాహుబలిలో కనిపించిన ఎనర్జీ ఇందులో అయితే లేదు. శ్రద్ధా కపూర్ మాయ చేసింది. స్క్రీన్ పై అందంగా కనిపించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగానే ఉంది. వెన్నెల కిషోర్ ఉన్నా నవ్వించలేకపోయాడు. మురళీ శర్మ పర్లేదు. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, టినూ ఆనంద్, లాల్ ఇలా చాలా మంది సినిమాలో ఉన్నారు. వాళ్లంతా ఉన్నంత వరకు బాగానే చేసారు.

టెక్నికల్ టీం:
సాహోలో పాటలకు పెద్దగా స్కోప్ లేదు. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే అనిపించింది. పాటలు ఆకట్టుకోలేదు. విజువల్‌గా బాగున్నా కూడా ఎందుకో కానీ డబ్బింగ్ వాసనలు కొట్టేసాయి. ఎడిటింగ్ శ్రీకర ప్రసాద్ అంటే చాలా ఊహించుకుంటాం కానీ ఎందుకో ఈ చిత్రంలో మాత్రం కొన్ని సన్నివేశాలు చూస్తున్నపుడు బాగా ల్యాగ్ అనిపించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మదీ వర్క్ ఆకట్టుకుంటుంది. కథ విషయంలో సుజీత్ ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. కథనం కూడా వీక్ అనిపించింది. అనుభవం లేకపోవడం కాదు కానీ ఇంత పెద్ద సినిమాను అతడు హ్యాండిల్ చేయలేకపోయాడేమో అనిపించింది. యాక్షన్ సీన్స్ మధ్యలో సినిమా చూసినట్లు అనిపించింది కానీ కథ కోసం తీసినట్లు అనిపించలేదు. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నంతంగా ఉన్నాయి.

చివరగా ఒక్కమాట:
సాహో.. యాక్షన్ ఎపిసోడ్స్ జయహో.. కానీ కథ మాత్రం..

రేటింగ్: 2.5/5
Published by: Praveen Kumar Vadla
First published: August 30, 2019, 1:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading