news18-telugu
Updated: February 3, 2020, 2:07 PM IST
RRR టీమ్‌లో జాయిన్ అయిన మహేష్, రజినీ, అమితాబ్ (Instagram/Photo)
దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు తెలుగు అగ్ర హీరోలతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అజయ్ దేవ్‌గణ్ ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ అయ్యాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ముఖ్యంగా రామ్ చరణ్,ఎన్టీఆర్ లపై క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ మిగిలి ఉంది. దీని కోసమే దాదాపు రూ. 85 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్టు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తోంది.రామ్ చరణ్ సరసన ఆలియా భట్ యాక్ట్ చేస్తోంది. అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ నటిస్తోంది.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
తాజాగా ఆర్ఆర్ఆర్ బృందంలో మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్ చేరబోతున్నట్టు సమాచారం. కానీ వీళ్లు ఈ సినిమాలో కనిపించరు.. కేవలం వినిపిస్తారంతే. ఆర్ఆర్ఆర్ సినిమా వర్గాల సమాచారం ప్రకారం మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. గతంలో మహేష్ బాబు.. ‘జల్సా’, బాద్షా, శ్రీశ్రీ సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదే హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్‌తో వాయిస్ ఓవర్ చెప్పించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలను రాజమౌళి కలిసి వారిని ఒప్పించినట్టు సమాచారం. ఇక కన్నడ వెర్షన్ విషయానికొస్తే.. సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. మొత్తానికి ఆయా భాషల్లో ఉన్న అగ్ర నటులతో కథను నేరేట్ చేయించి అన్ని భాషల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా రాజమౌళి చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
February 3, 2020, 2:00 PM IST