టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన దెబ్బకు ఓ సినిమా యూనిట్ ఏకంగా మూవీ పేరునే మార్చేసే పరిస్థితి వచ్చిందట. ఆయనే మార్చమని అడిగారో లేకుంటే.. మనకెందుకులే దిల్ రాజుతో అనుకున్నారో కానీ ఆ చిత్ర యూనిట్ మాత్రం పేరు మార్చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? ఆ సినిమాతో రాజుగారికి ఉన్న సంబంధమేంటి..? అసలు ఈ వ్యవహారం వెనుక అసలేం జరిగింది..? ఇంతకీ ఆ ‘రౌడీ బాయ్స్’, ‘రౌడీ బేబీ’ల సంగతేంటి అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ముందుగా ‘రౌడీ బేబీ’ విషయానికొస్తే.. ఈ సినిమాకు సందీప్ కిషన్, నేహా శెట్టిని హీరోహీరోయిన్లుగా అనుకున్నారు. అంతేకాదు.. ఈ చిత్రాన్ని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తుండగా.. నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కోన వెంకట్ ‘రౌడీ బేబీ’ సమర్పిస్తున్నట్లు కూడా ప్రకటన వచ్చింది. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో తీస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించాలని యూనిట్ భావించింది. అయితే అనుకోకుండా ఓ చిక్కు వచ్చి పడింది. ఒక రకంగా చెప్పుకుంటే ఇది చిత్ర యూనిట్‌కు ఒకింత షాకింగ్ న్యూసే.!. అదేమిటంటే..‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను మార్చేస్తున్నామని త్వరలోనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఆలోచించి పూర్తి వివరాలతో అభిమానుల ముందుకొస్తామని కోన ఫిల్మ్ కార్పొరేషన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ఈ ప్రకటన వెనుక పెద్ద తతంగమే జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ దిల్ రాజే అని భోగట్టా. అసలేం జరిగింది..? దిల్‌రాజుకి.. ‘రౌడీ బేబీ’ కి లింకేంటి? అని ఆరా తీయగా కొన్ని ఆసక్తికర విషయాలే వెలుగుచూశాయి. వాస్తవానికి రాజు సోదరుడు శిరీష్ కొడుకు హీరోగా అరంగేట్రం చేయించాలని చూస్తున్నారు. మంచి కథను వెతికిన రాజు ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్‌ని చాంబర్‌లో రిజిస్టర్ చేయించుకున్నారట. అయితే ఇది వరకే ‘రౌడీ బేబీ’ అనే టైటిల్ ఇదివరకే ఉండటం.. దాదాపు రెండు టైటిల్స్ దగ్గర దగ్గరగా ఉండటంతో చాంబర్‌లో అభ్యంతరం తెలిపారట. దీంతో ఏం చేయాలా..? అని ఆలోచించిన రాజు.. ఇక ఆ సినిమాకు సంబంధించిన నిర్మాత, దర్శకుడితో మంతనాలు జరిపారట.
Some changes are Pleasant & for Good!! Wait for our exciting New Title!! We will also be coming up with our look & release date !! https://t.co/GTBfJTou1h
— kona venkat (@konavenkat99) March 13, 2021
వాళ్లు ఒప్పుకున్నారో.. రాజుగారే బలవంతంగా ఒప్పించారో తెలియట్లేదు కానీ.. కొన్ని గంటల్లోనే కోన ఫిలిమ్స్ నుంచి పై విధంగా ప్రకటన వచ్చేసిందట. రాజుకు ఇండస్ట్రీలో దాదాపు అందరితోనూ మంచి సాన్నిహిత్యమే ఉంది. ఆయన మాట దాదాపు ఎవరూ కాదనరు కూడా. అందుకే ఈ ‘రౌడీ బేబీ’ టైటిల్ విషయంలో ఆయన్ను కాదనలేక మార్చేస్తున్నట్లు ప్రకటించేశారట. దీనిపై సోషల్ మీడియాలో, మీడియాలో గత రెండు మూడ్రోజులుగా పెద్ద చర్చే జరుగుతోంది. ‘రౌడీ బాయ్స్’ దెబ్బకు ‘రౌడీ బేబీ’ అడ్రస్ హుష్ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం దిల్ రాజు దెబ్బకు ఏకంగా సినిమా పేరే మారిపోయిందిగా అని తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. వర్కింగ్ టైటిల్ మార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయ్ కానీ.. ఇలా టైటిల్ అనుకున్న తర్వాత, త్వరలోనే షూటింగ్ మొదలెట్టాలన్నప్పుడు టైటిల్ మార్చిన సందర్భాలు చాలా తక్కువే ఉంటాయేమో..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dil raju, Rajendra Prasad, Sundeep Kishan