వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణి సీరియస్ కామెంట్స్ చేశారు. దర్బార్ సినిమా వివాదంపై ఆయన స్పందించారు. దర్బార్ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు దర్శకుడు మురుగదాస్‌ను టార్గెట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. హీరోలు, నిర్మాతలతో వివాదాలు ఉంటే టెక్నీషియన్లను టార్గెట్ చేయడం సరికాదన్నారు. రజినీకాంత్ హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నిరాశను మిగిల్చింది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమా రజినీకాంత్ ఇమేజ్‌తో కచ్చితంగా ఆడుతుందనుకున్నారు కానీ మ్యాజిక్ రిపీట్ కాలేదు. మురుగదాస్ ఉన్నా కూడా దర్బార్ సినిమా ఫ్లాప్ లిస్టులోకే వెళ్లింది. ఈ చిత్రంతో నష్టపోయిన బయ్యర్లు రజినీకాంత్‌ను కలిసారు. తమ నష్టాలకు ఏదో ఓ మార్గం చూపించాలని.. లేదంటే తాము రోడ్డున పడాల్సి వస్తుందని వాళ్లు సూపర్ స్టార్‌కు విన్నవించుకోవాలనుకున్నారు కానీ కుదర్లేదు. వాళ్లకు అక్కడ పర్మిషన్ కూడా రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన దర్బార్.. కనీసం 100 కోట్లు షేర్ కూడా తీసుకురాలేదు. కేవలం తమిళనాడులోనే 64 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటి వరకు వచ్చింది 37 కోట్లు మాత్రమే. దాంతో ఎటు చూసుకున్నా కూడా దర్బార్ సినిమా భారీగానే నష్టాలు తీసుకొచ్చింది.
తమిళనాడు దర్శకుల సంఘానికి సెల్వమణి అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్పందించారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమాను నిర్మాతల దగ్గరి నుంచే కొనుక్కుంటారని చెప్పారు. ఒకవేళ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే వారికి వచ్చిన లాభాల్లో నుంచి హీరోలకు, దర్శకులకు ఏమైనా డబ్బులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఒకవేళ సినిమా నష్టాలను మిగిల్చినా మరో మార్గంలో దాన్ని భర్తీ చేసుకోవచ్చనే ముందస్తు ఆలోచన డిస్ట్రిబ్యూటర్లలో సహజంగానే ఉంటుందన్నారు. అసలు ఇలాంటి ట్రెండ్ సెట్ చేసింది రజినీకాంత్ (డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి చెల్లించడం) అని అన్నారు. ఆయన చేసిన భారీ తప్పు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దర్శకులతో డిస్ట్రిబ్యూటర్లు ఈ తరహాలో ప్రవర్తించడం సరికాదన్నారు. దర్శకుడు మురుగదాస్‌కు దర్శకుల సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరోవైపు దర్బార్ సినిమా నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నట్లు చెబుతున్నాడు దర్శకుడు మురుగదాస్. ఈ మేరకు ఆయన కూడా రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి హాని ఉందని.. రక్షణ కల్పించాలని కోర్టుకు విన్నవించాడు ఈ దర్శకుడు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసినా కూడా అంచనాలు అందుకోలేకపోయాడు మురుగదాస్. ఈ చిత్రంతో చాలా మంది బయ్యర్లు రోడ్డు మీదకు వచ్చేసారని తెలుస్తుంది. చెన్నైలోని రజినీ ఇంటికి వెళ్లాలని బయ్యర్లు ప్రయత్నించినా కూడా వాళ్లను పట్టించుకోలేదు సూపర్ స్టార్. దర్శకుడు మురుగదాస్‌ను కలవడానికి ప్రయత్నించినా ఇదే సీన్ రిపీట్ కావడంతో కోర్టుకు వెళ్ళారు బయ్యర్లు.
మురుగదాస్ తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు వెళ్లడంతో దర్శకుడు తనకు భద్రత కావాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సెల్వమణి స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AR Murugadoss, Darbar, Rajinikanth, Roja Selvamani