ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘సలార్’. ఫిబ్రవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జనవరి లోపు ప్రభాస్ తన 20వ చిత్రం 'రాధేశ్యామ్'ను పూర్తి చేసే పనిలో నిమగ్నమైఉన్నాడు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్‌ను తెలంగాణలో ప్రారంభించబోతున్నారట. ఇంతకీ తెలంగాణలో ఎక్కడా 'సలార్' షూటింగ్ ప్రారంభం అవుతుందో తెలుసా? సింగరేణి. ఈ పేరు వినగానే బొగ్గుగని అందరికీ గుర్తుకు వస్తుంది. ఈ ప్రాంతంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ కోసం సింగరేణిలో ఓ భారీ సెట్‌ను వేస్తున్నట్లు సమాచారం. ఆ సెట్లో యాక్షన్ ఎపిసోడ్ షూట్ ఉంటుందని అంటున్నారు.
'సలార్' అంటే సైన్యాధిపతి.. కింగ్ మేకర్ అనే అర్థం వస్తుందంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి ఇందలో కింగ్ ఎవరు? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ప్రభాస్ జోడీగా కమల్ హాసన్ ముద్దుల తనయ, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ నాలుగు నెలల సమయాన్ని కేటాయించాడని టాక్ వినిపిస్తోంది.
'సలార్' తర్వాత.. ప్రభాస్, ఓం రావుత్ కాంబినేషన్లో రూపొందిన ‘ఆదిపురుష్’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుంటే, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. కృతిసనన్ సీత పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.