తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు (KS Nageswara Rao) హఠాన్మరణం చెందారు. నవంబర్ 27 ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ వచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులతో పాటు అతడి కుటుంబ సభ్యుల నుంచి కూడా అధికారిక సమాచారం వచ్చింది. కెఎస్ నాగేశ్వరరావు మరణవార్త తెలిసిన వెంటనే.. సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అతడితో పరిచయం ఉన్న వాళ్లు.. సన్నిహితులు.. స్నేహితులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుడుంబా శంకర్ దర్శకుడు వీరశంకర్ కూడా స్నేహితుడు కెఎస్ నాగేశ్వరరావు మరణాన్ని ధృవీకరించారు. ఎన్నో ఏళ్లుగా వీరశంకర్, కె.ఎస్.నాగేశ్వరరావు మంచి స్నేహితులు. హైదరాబాద్‌కి వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలో ఆయన ఫిట్స్‌కి గురయ్యారు నాగేశ్వరరావు. హుటాహుటిన సమీపంలో ఉన్న రెండు మూడు ఆసుపత్రులకు తరలించారు. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.
చివరికి ఏలూరు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ దర్శకుడి పార్థివ దేహాన్ని ప్రస్తుతం అత్తగారు ఊరైనా నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో ఉంచారు. అక్కడే కెఎస్ నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఆయనకు ఓ కుమారుడు, కూతురు, భార్య ఉన్నారు. 1986 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కెఎస్ నాగేశ్వరరావు. లెజెండరీ దర్శకుడు దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈయన.. రాజశేఖర్ తళంబ్రాలు సినిమా నుంచి ఆయన వద్దే ఉన్నారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా మారారు.
ఇందులో కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించారు. ఇది విజయం సాధించింది. ఆ తర్వాత రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ నాగేశ్వరరావు తెరకెక్కించిన పోలీస్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి లాంటి సినిమాలు కూడా చేసాడు ఈయన. తన అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ బిచ్చగాడు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు కెఎస్ నాగేశ్వరరావు. కొన్నాళ్లుగా ఈ సినిమా ఆగిపోయింది. మళ్లీ మొదలు పెడదామనుకునే సమయంలోనే హఠాత్తుగా నాగేశ్వరరావు మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర ప్రముఖులు వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood