మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయిదు పదుల వయసు దాటినా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ముందుకెళ్తున్నారు. జయాపజయాలను లెక్కచేయకుండా కథ నచ్చితే సినిమా చేస్తూ పోతున్నారు రవితేజ. గతేడాది ధమాకా సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ్.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా (Tiger Nageshwara Rao) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. కొంతకాలం క్రితం ఇటు ప్రజలకు .. అటు పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఈ సినిమాతో తెలుగు తెరకి నుపూర్ సనన్ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. 1970ల నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని గెటప్‌లో రవితేజ కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ అధికారికంగా ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ లైనప్ సినిమాల కోసం మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ రోల్ కీలకం అని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంలో రవి తేజ, రేణు దేశాయ్ నడుమ వచ్చే కొన్ని సన్నివేశాలు మాస్ అభిమానులకు పూనకాలు తెప్పించనున్నాయట.
రేణు దేశాయ్ తెలుగు తెరపై సందడి చేసి దాదాపు 18 సంవత్సరాలు పూర్తయింది. మొన్నామధ్య ఓ మరాఠా సినిమాను తెరకెక్కించి నటించింది కానీ తెలుగు తెరపై మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు. ఇన్నేళ్లకు ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం. ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ కనిపించనుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja, Tollywood, Tollywood actor