మనం ఆపదలో ఉన్నపుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉండే బలగం కాదు.. మనలో ఉన్న బలం. ఇది మనం చెప్పిన మాట కాదు.. రవితేజ చెబుతున్న మాట. "అమర్ అక్బర్ ఆంటోనీ" కోసం ఈ లైన్ రాసాడు శీనువైట్ల. ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన తొలి టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత కచ్చితంగా రవితేజ, శీనువైట్ల ఎంత కసి మీదున్నారో అర్థమైపోతుంది.
రొటీన్ రివేంజ్ ఫార్ములా మాదిరే కనిపిస్తుంది కానీ అందులోనే కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు శీనువైట్ల. మూడు కారెక్టర్స్ టీజర్ లో హైలైట్ చేసారు. టీజర్ చాలా స్టైలిష్ అండ్ లావిష్ గా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కావడంతో సినిమాపై నమ్మకాలు కూడా ఎక్కువ గానే ఉన్నాయి. పైగా రవితేజ, శీనువైట్లకు ఇప్పుడు "అమర్ అక్బర్ ఆంటోనీ" విజయం కీలకంగా మారింది. ఇది కానీ తేడా కొడితే ఈ ఇద్దర్నీ ఒకేసారి మరిచిపోవచ్చు.
అందుకే చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదు ఈ ఇద్దరు. షేర్ పద్దతిలో ఈ సినిమా చేస్తున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత అందులో వాటా తీసుకోనున్నారు శీనువైట్ల, రవితేజ. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. బడ్జెట్ ఈ సారి భారీగానే ఉంది. రవితేజ మార్కెట్ తో పనిలేకుండా మైత్రి వాళ్లు భారీగానే ఖర్చు చేసారు.
ఈ సినిమా టైటిల్ "అమర్ అక్బర్ ఆంటోనీ" అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలియాలంటే సినిమాకు రావాల్సిందే అంటున్నాడు శీనువైట్ల. రవితేజ త్రిపాత్రాభినయం మాత్రం చేయడం లేదని.. ఒక్కడే కానీ ముగ్గురు అంటున్నాడు ఈ దర్శకుడు. సునీల్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. నవంబర్ 16న విడుదల కానుంది. మరి చూడాలిక.. ఈ ఒక్కడే కానీ ముగ్గురు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేయబోతున్నారో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja, Telugu Cinema