ఇప్పుడు రవితేజను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఈయనకే వరస ఫ్లాపులు వస్తుంటే.. మళ్లీ ఈయన వరసగా ఫ్లాపులు ఇస్తున్న దర్శకులకు ఆఫర్స్ ఇస్తున్నాడు. ఒక్క సినిమా అనుకునేలోపు మరో ఆఫర్ ఇస్తున్నాడు మాస్ రాజా. ఇప్పటికే వరసగా సినిమాలు చేస్తున్న ఈయన.. వరసగా ఫ్లాప్ దర్శకులను నమ్ముకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు ఈయన. గోపీ గత సినిమా విన్నర్ విడుదలై మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. సాయి తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ కూడా లూజరే. ఇక ఈ మధ్యే ఒక్క క్షణం లాంటి డిజాస్టర్ తర్వాత విఐ ఆనంద్కు డిస్కో రాజాతో ఛాన్సిచ్చాడు.
అయినా కూడా ఈయన ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం క్రాక్ సినిమాతో పాటు రమేష్ వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈయన గత సినిమా రాక్షసుడు పర్లేదు అనిపించింది కానీ అది రీమేక్ సినిమా. క్రాక్, రమేష్ వర్మ సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ.. ఆ మధ్య మరో ఫ్లాప్ దర్శకుడికి ఆఫర్ ఇచ్చాడు. నా పేరు సూర్య సినిమాతో బన్నీ భారీ ఫ్లాప్ ఇచ్చి రెండేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న వక్కంతం వంశీకి రవితేజ ఆఫర్ ఇచ్చాడు.
అంతకుముందు కిక్, టచ్ చేసి చూడు, కిక్ 2 లాంటి సినిమాలకు కథలు అందించాడు వంశీ. దాంతో అదే సాన్నిహిత్యంతో ఇప్పుడు వంశీకి ఆఫర్ ఇచ్చాడు మాస్ రాజా. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. మొత్తానికి ఏదేమైనా కూడా వరసగా ఫ్లాప్ దర్శకులకు అవకాశమిస్తున్నాడు రవితేజ. మరి ఈయన నమ్మకాన్ని వాళ్లెంతవరకు నిలబెడతారో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood