సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే రెండు వారాల్లో ముగుస్తుంది. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా కూడా వారం రోజులు.. బాగుంటే మరో వారం రోజులు అంతేకానీ మూడు నాలుగు వారాలు మాత్రం ఆడవు కదా.. కానీ ఈ సారి అద్భుతం జరిగింది. సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఇప్పటికీ థియేటర్స్‌లో కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్‌లో 80 శాతం వరకు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో కనిపిస్తున్నాయి. రెండు వారాలు కావొస్తున్నా కూడా ఇప్పటికీ పండగ సినిమాలు జోరు చూపిస్తూనే ఉన్నాయి. అల వైకుంఠపురములో అయితే ఇప్పటికీ దుమ్ము దులిపేస్తుంది. కొన్ని ఏరియాల్లో అయితే టికెట్స్ కూడా దొరకడం లేదు.
ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా బి, సి సెంటర్స్‌లో రప్ఫాడిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల షేర్ దాటేసాయి. ఇక ఇప్పుడు రవితేజ డిస్కో రాజా విడుదల కానుంది. జనవరి 24న వస్తుంది ఈ చిత్రం. దీనికి ఇప్పుడు థియేటర్స్ కావాలి.. అయితే సంక్రాంతి సినిమాల్లో అల వైకుంఠపురములో తీయడానికి ఇప్పుడు బయ్యర్లు కూడా ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండటంతో ఈ వారం కూడా భారీగానే థియేటర్స్ ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే సరిలేరు నీకెవ్వరుకు మాత్రం 30 నుంచి 40 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది.
ఇప్పుడు ఈ థియేటర్స్ డిస్కో రాజాకు వస్తే బాగానే ఉంటుంది. కానీ దానికి ఆ చిత్ర నిర్మాతలు ఒప్పుకుంటారా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే వీకెండ్ కోసమే కొత్త సీన్స్ కూడా యాడ్ చేసారు దర్శక నిర్మాతలు. ఇలాంటి సమయంలో ఉన్న థియేటర్స్‌లో కొన్ని డిస్కో రాజాకు ఇవ్వడానికి వాళ్లు ఒప్పుకోవడం కష్టమే. కచ్చితంగా తమ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో డిస్కో రాజాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి.. పక్కాగా తీసేయాల్సిన పరిస్థితి కల్పిస్తే తప్ప రవితేజ సినిమాకు సరిపోయేన్ని స్క్రీన్స్ దొరకడం కష్టమే. మరి చూడాలిక.. ఈ సమయంలో సంక్రాంతి సినిమాల ధాటిని డిస్కో రాజా ఎంతవరకు తట్టుకుంటాడో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disco Raja, Ravi Teja, Telugu Cinema, Tollywood