రవితేజ కెరీర్లో ఈ రోజుకు కూడా లాభాల పరంగా కానీ.. మార్కెట్ పరంగా కానీ చూసుకుంటే అతడి టాప్ సినిమాల్లో ఒకటి కిక్. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే 30 కోట్ల వరకు వసూలు చేసి రవితేజ రేంజ్ ఏంటో చూపించింది ఈ చిత్రం. కిక్ విడుదలై సరిగ్గా 11 ఏళ్లవుతుంది. 2009 మే 8 న విడుదలయ్యింది ఈ సినిమా. అప్పటికే అతిథి, అశోక్ లాంటి ఫ్లాపులతో వెనకబడిపోయిన సురేందర్ రెడ్డి కిక్ కథ సిద్ధం చేసుకున్నాడు. దీన్ని ఒప్పించడానికి చాలా మంది హీరోలను కలిసాడు. కానీ చాలా మంది దీన్ని రిజెక్ట్ చేసారు కూడా.
వక్కంతం వంశీ రాసిన ఈ కథ ముందు రవితేజ కోసం మాత్రం సిద్ధం చేయలేదు.. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన కథ కూడా కాదు. ప్రభాస్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ముందుగా ఈ కథను వినిపించాడు సురేందర్ రెడ్డి. ఎక్కడో లెక్క తప్పి ఈ చిత్రానికి వాళ్లు నో చెప్పారు. ఆ తర్వాత రవితేజ లైన్లోకి వచ్చాడు. మాస్ రాజా ఎంట్రీతో కిక్ స్వరూపమే మారిపోయింది.
ఆయనతో పాటు బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. చివర్లో పాప ఎమోషనల్ ఎపిసోడ్.. ఇలియానా గ్లామర్.. కొత్త నటుడు శ్యామ్ నటన.. అన్నీ కలిపి అప్పటి వరకు 10 కోట్లున్న రవితేజ మార్కెట్‌ను ఏకంగా 25 కోట్లకు పెంచేసింది.
ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతీసారి కూడా కిక్ మంచి రేటింగ్స్ తీసుకొస్తుంటుంది. అంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఈ చిత్రం. కిక్ కోసం ఏదైనా చేసే పాత్రలో చెలరేగిపోయాడు రవితేజ. ఎన్టీఆర్, ప్రభాస్ రిజెక్ట్ చేసినా కూడా సరైన హీరోకే ఈ చిత్రం పడిందని తర్వాత అభిమానులు కూడా సంతోషపడ్డారు. ఏదేమైనా కూడా ఈ చిత్రం వచ్చి అప్పుడే 11 ఏళ్లవుతుందంటే మాత్రం నమ్మడం కాస్త కష్టమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood