జనవరి 26 అంటే కేవలం రిపబ్లిక్ డే మాత్రమే కాదు రవితేజ పుట్టిన రోజు కూడా. ఆగస్ట్ 15న శ్రీహరి పుడితే.. జనవరి 26న రవితేజ జన్మించాడు. క్రాక్ సినిమాతో సత్తా చూపిస్తున్న ఈయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా పారితోషికం గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెరుగుతున్న ఖర్చులతో పాటు ఏటేటా మన హీరోలు కూడా తమ పారితోషికం పెంచేస్తున్నారు. రెండేళ్ల కింద 10 కోట్లు తీసుకున్న హీరోలే ఒక్క హిట్ వస్తే తమ రేట్ 15 అంటున్నారు. అలాంటి రోజులు ఇప్పుడున్నాయి. కరోనా టైమ్ కాబట్టి కాస్త కనికరిస్తున్నారు కానీ లేదంటే మాత్రం ఒక్కో హీరో చెలరేగిపోయేవాడు. మన సినిమా మార్కెట్ రేంజ్ కూడా అలాగే పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాకు 10 కోట్ల వరకు తీసుకుంటున్న రవితేజ ఒకప్పుడు తన తొలి పారితోషికం ఎంత తీసుకున్నాడో తెలుసా..? ఎవరు ఇచ్చారో తెలుసా.. ఇదంతా తెలిస్తే వారెవ్వా అంటారు. ఎందుకంటే రవితేజ కెరీర్ చాలా ఆదర్శంగా ఉంటుంది. ఎక్కడ మొదలుపెట్టి.. ఎక్కడి వరకు వచ్చాడాయన..? చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగింది రవితేజ మాత్రమే. ఈ తరంలో అంటే నాని, విజయ్ దేవరకొండ ఉన్నారు. కానీ గత 40 ఏళ్లలో టాలీవుడ్‌పై తమదైన ముద్ర వేసిన హీరోల్లో ఒకరు చిరు.. ఆ తర్వాత మాస్ రాజా రవితేజనే.

రవితేజ (Ravi Teja)
1990ల్లో వయసు 20ల్లో ఉన్నపుడే ఇండస్ట్రీకి వచ్చాడు రవితేజ. వచ్చి చాలా ఏళ్ళ వరకు తిండి కూడా లేకుండా కష్టపడ్డాడు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. తెలుగులో కూడా నిన్నే పెళ్లాడతా, అల్లరి ప్రియుడు లాంటి సినిమాల్లో హీరో స్నేహితుడిగా నటించాడు. అంతకు ముందు గ్యాంగ్ లీడర్ హిందీ రీమేక్ ఆజ్ కా గూండారాజ్ సినిమాలో కూడా నటించాడు. ముందు డైరెక్షన్ నుంచి నటన వైపు వచ్చాడు. హీరో నుంచి మాస్ హీరో అయ్యాడు.. ఇప్పుడు మాస్ రాజా అయ్యాడు రవితేజ.

నాగార్జున రవితేజ (Nagarjuna Ravi Teja)
అలాంటి మాస్ రాజా తను అందుకున్న తొలి పారితోషికం గురించి ఓపెన్ అయ్యాడు. నిన్నే పెళ్లాడతా సమయంలో నాగార్జున చేతుల మీదుగా ఈయన తొలి రెమ్యునరేషన్ అందుకున్నాడు. 3500 రూపాయలతో ఆయన సంతకం పెట్టిన చెక్ తనకు ఇచ్చారని.. దాన్ని చాలా రోజుల వరకు దాచుకున్నానని చెప్పాడు రవితేజ. ఆ తర్వాత కొన్ని రోజులకు డబ్బులు అవసరం పడి బ్యాంకులో వేసుకున్నానని చెప్పాడు మాస్ రాజా. ఏదేమైనా కూడా రవితేజ తొలి పారితోషికం గురించి తెలిసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 26, 2021, 14:18 IST