రష్మిక మందన్న, పూజా హెగ్డే.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మలకు ఉన్న క్రేజ్ గురించి ఏం చెప్పాలి..? ఒక్కొక్కరు సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. దీన్నిబట్టి వాళ్ల రేంజ్ మనకు అర్థమైపోతుంది. ఇలాంటి హీరోయిన్స్‌ను సినిమాకు ఒక్కర్ని భరించాలంటేనే నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది. మరి అలాంటిది ఒకే సినిమాలో ఇద్దర్నీ తీసుకోవాలంటే అమ్మో ఇంకేమైనా ఉందా..? కానీ ఇప్పుడు అలాంటి విచిత్రమే జరగబోతుంది. నిజంగానే రష్మిక, పూజా హెగ్డే ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారిప్పుడు. అలాంటి ఒకే సినిమా కోసం ఇద్దరి డేట్స్ పట్టుకోవడం అంటే నిర్మాతలకు తలకు మించిన భారమే. కానీ అక్కడున్న నిర్మాత మామూలోడు కాదు.. అందుకే పట్టేసాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో బిజీగా ఉంది పూజా. మరోవైపు రష్మిక కూడా అల్లు అర్జున్ పుష్ప.. శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలలో నటిస్తుంది. దాంతో పాటు తమిళ, కన్నడ సినిమాలు బోనస్.
ఇలాంటి సమయంలో ఈ ఇద్దర్ని తన కథతో మెప్పించాడు దర్శకుడు దర్శకుడు హను రాఘవపూడి. 2018లో పడిపడి లేచే మనసు తర్వాత మళ్లీ సినిమా చేయలేదు ఈయన. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నిర్మాతలతో పాటు హీరోలు కూడా హను వైపు చూడట్లేదు. దాంతో ఈయన ఏకంగా మలయాళ స్టార్ హీరోను పట్టుకున్నాడు. మహానటి సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ఓ భారీ పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు హను. దాదాపు 40 కోట్లతో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో సైనికుడిగా నటిస్తున్నాడు దుల్కర్.
ఈ సినిమాలో పూజా హెగ్డే, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కథ కూడా చెప్పి ఒప్పించాడని తెలుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఒకే సినిమాలో ఇద్దరు టాప్ హీరోయిన్లను తీసుకోవడం అంటే మాటలు కాదు. కానీ హను రాఘవపూడి చేసి చూపిస్తున్నాడు. పైగా కెరీర్‌లో ఒక్క బ్లాక్‌బస్టర్ కూడా లేకుండానే ఇదంతా చేస్తున్నాడు హను. ఈయన కెరీర్‌లో కృష్ణగాడి వీర ప్రేమగాధ మాత్రమే యావరేజ్‌గా ఆడింది. మిగిలిన అందాల రాక్షసి, లై, పడిపడి లేచే మనసు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సినిమా ఎలా ఉండబోతుందో..? ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Rashmika mandanna, Telugu Cinema, Tollywood