జయలలిత చనిపోయిన మూడేళ్ల తర్వాత వరసగా అంతా బయోపిక్స్ చేస్తున్నారు. తమిళనాట ఇప్పుడు ఈమె జీవితంపై మూడు బయోపిక్స్ ఎవరికి వారు సపరేట్గా తీస్తున్నారు. అందులో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో గౌతమ్ మీనన్ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. మొత్తం 14 ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయి. దీనికి క్వీన్ అనే టైటిల్ పెట్టాడు గౌతమ్. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదని అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మొన్న విడుదలైన తలైవి టీజర్ కంటే ఇది అద్భుతంగా ఉందంటున్నారు అభిమానులు.
తమిళనాట జయలలిత ఓ సినీ నటిగా.. పార్టీ అధినేత్రిగా.. ఓ ముఖ్యమంత్రిగా.. ఓ ఐరన్ లేడీగా.. ఇలా ఒక్కటేంటి ఇండియాలో బహుశా మరే లేడీకి సాధ్యం కాని రీతిలో చరిత్ర తిరగరాసింది అమ్మ. ఈమె చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో రక్తి కట్టించే మలుపులకు.. అనూహ్య సంఘటనలకు లెక్కే లేదు. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. 2016 డిసెంబర్లో జయలలిత అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె మరణం కూడా ఇప్పటికీ ఒక మిస్టరీయే. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ది ఐరన్ లేడీ అనే సినిమా వస్తుంది. తలైవి ఎలాగూ అందరికీ తెలిసిందే.
ఇప్పుడు రమ్యకృష్ణ క్వీన్ వెబ్ సిరీస్ కూడా వస్తుంది. జయ చిన్ననాటి జీవితం నుంచి మొదలుపెట్టి.. ఆమె స్కూల్ జీవితం.. ఎదిగిన విధానం.. ఆ తర్వాత సినిమాలు.. ఎంజీఆర్‌తో పరిచయం.. సినిమాల్లో స్టార్ డమ్.. ఆయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు తీసుకున్న విధానం అన్నీ చూపించాడు గౌతమ్ మీనన్. టీజర్ చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. డిసెంబర్ 14న విడుదల కానుంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌ను మురుగేశన్ అనే దర్శకుడితో కలిసి గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత తలైవి సినిమాపై అంచనాలు తగ్గిపోతాయేమో అని భయపడుతున్నారు నిర్మాతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jayalalithaa Web Series Queen, Ramya Krishna, Telugu Cinema, Tollywood