కొన్ని సినిమాలు అంతే.. థియేటర్స్‌లో ఆ సమయానికి ఉన్న కారణాలో మరే ఇతర పరిస్థితులో తెలియదు కానీ అప్పుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ అవే సినిమాలు టీవీలో వచ్చినపుడు మాత్రం దుమ్ము దులిపేస్తుంటాయి. 'ఖలేజా', 'అతడు' లాంటి సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. అచ్చంగా ఇప్పుడు రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' విషయంలో ఇదే జరుగుతుంది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై ఫ్లాప్ అయింది. మరీ రొటీన్ ఫార్ములాతో వచ్చిందని అప్పుడే తేల్చేసారు విమర్శకులు. ఫ్యాన్స్ కూడా దీనిపై పెదవి విరిచారు.
తల నరికితే గద్దలు ఎత్తుకెళ్లిపోవడం ఏంటని.. కదిలే ట్రైన్‌పై హీరో నిలబడటం ఏంటి.. క్లైమాక్స్‌లో పాము విలన్‌ను కాటేసి అదే చచ్చిపోవడం ఏంటి.. బోయపాటి తెలుగు సినిమా స్థాయిని మరో పదేళ్లు దించేసాడంటూ విమర్శలు కూడా బాగానే వచ్చాయి. దానికి తగ్గట్లుగానే సినిమా కూడా నిరాశ పరిచింది. అయితే ఈ చిత్రాన్ని మా టీవీ భారీ రేట్ ఇచ్చి తీసుకుంది. బుల్లితెరపై కూడా 'వినయ విధేయ రామ' సినిమాకు అంత ఆదరణ ఉండదనే అనుకున్నారంతా. కానీ ఈ సినిమాను ప్లే చేసిన ప్రతీసారి అద్భుతాలు చేస్తుంది. లాక్‌డౌన్ పుణ్యమాని టీవీల్లో వస్తున్న కొన్ని సినిమాలకు మంచి రేటింగ్ వస్తుంది.
అందులోనే రామ్ చరణ్ సినిమా కూడా ఉంది. ఇప్పటి వరకు ‘వినయ విధేయ రామ’ సినిమాను బుల్లితెరపై 8 సార్లు టెలికాస్ట్ చేస్తే.. ప్రతీసారి మంచి టిఆర్పీ తీసుకొస్తుంది. ఈ 8 సార్లలో తక్కువ టీఆర్‌పీ 5.19 కాగా.. హై టీఆర్‌పీ 8.2.. యావరేజ్‌గా 7.4. ఎనిమిదో సారి టెలికాస్ట్ చేస్తే దాని టిఆర్పీ కూడా 7.98 టీఆర్‌పీ రావడం విశేషం. మొత్తానికి 'వినయ విధేయ రామ' బుల్లితెరపై మాత్రం మ్యాజిక్ చేస్తూనే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Charan, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama