Rakul Preet Singh: ఏదైనా కొత్త పని నేర్చుకోవాలనుకున్నా.. లేదా చేయాలనుకున్నా చాలా మంది చెప్పే మాట సమయం సరిపోవట్లేదని. పొద్దున లేచినప్పటి నుంచి ఉన్న పనులతోనే సరిపోతుంది. ఇంక కొత్త పనేంటి..? అని చాలామంది అంటూ ఉంటారు. అయితే రోజుకు ఉన్న 24 గంటలను ఎలాగూ మార్చలేము కాబట్టి.. ఉన్న సమయానికి తగ్గట్లుగానే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. ఇక హీరోహీరోయిన్లకు అయితే ఈ ప్లాన్ చాలా అవసరం. ఎందుకంటే వారు కేవలం సినిమా షూటింగ్‌లు ఒక్కటే కాదు.. అందుకోసం శరీరాన్ని చాలా శ్రమ పెట్టాల్సి వస్తుంది. అలాగే తమ వ్యక్తిగత జీవితానికి కూడా వారు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు పక్కా ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు.
కాగా టైమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఓ చిన్న వీడియోలో వివరించింది. తాజాగా రకుల్ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో సైక్లింగ్ చేస్తున్నారు రకుల్. ఇక ఆ పోస్ట్‌కు.. ''నేనేం చెప్పాలనుకున్నానంటే సెట్స్ వరకు వెళ్లేందుకు సైక్లింగ్ చేస్తూ వెళ్లా. టైమ్ మేనేజ్మెంట్. 12 కి.మీలు. మేడే అంటూ కామెంట్ పెట్టారు. దానికి నెటిజన్లు వావ్.. మీ టైమ్ మేనేజ్మెంట్కి హ్యాట్సాఫ్'' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే గత రెండేళ్లుగా కాస్త వెనుకబడ్డ రకుల్.. ఈ సంవత్సరం మాత్రం ఫుల్ బిజీగా గడిపేయనుంది. ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్ చెక్ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ్లో కమల్ హాసన్ ఇండియన్ 2, శివ కార్తికేయన్ అలయాన్లో నటిస్తున్నారు. వీటితో పాటు హిందీలో సర్దార్ అండ్ గ్రాండ్సన్, అటాక్, మేడే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన ఓ మూవీలోనూ రకుల్ నటించారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.