news18-telugu
Updated: November 30, 2020, 11:13 AM IST
రకుల్ ప్రీత్ Photo : Twitter
Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రకుల్ ప్రీత్.. సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తన తొలి విజయాన్ని గుర్తు చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ‘‘ఏడేళ్ల క్రితం ఇదే రోజు నవ్వుతూ ఉన్నాను. ఇప్పుడూ అదే నవ్వు నా మొహం మీద ఉంది. దీనంతటికీ కారణం నన్ను ఎంతో ప్రేమతో ఆదరించిన, అభిమానించిన ప్రేక్షకుల వల్లే. ఎక్కడో ఢిల్లీ అమ్మాయిని అయినా అచ్చ తెలుగు అమ్మాయిగా ఈ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. ఈ నా సినీ జర్నిలో నన్ను ఓ యాక్టర్‌గా నమ్మిన దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ క్రమంలో నేను ఇంకా మంచి నటిగా, మనిషిగా మారడానికి మీ సలహాలు, సూచనలు, విమర్శలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. ఇదంతటి కారణం నా కుటుంబం, నా టీమ్. వీరే లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదని పేర్కోంది. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఆమె ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు, తమిళంలో ‘భారతీయుడు 2’, ‘అయాలన్’, తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తోంది. అది అలా ఉంటే.. ఈ మధ్య రకుల్, మోహన్ బాబు తాజా సినిమా సన్ ఆఫ్ ఇండియాలో నటిస్తున్నట్లు కొన్ని వార్తలు రాగా.. వాటిని ఖండించింది. ఇక రకుల్‌కు హిందీలో మంచి అవకాశం వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'మేడే' అనే చిత్రానికి స్టార్ హీరో అజయ్ దేవ్గన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తరువాత సీనియర్ స్టార్ అమితాబ్, అజయ్‌లు కలిసి పనిచేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశం వచ్చింది. ఈ సినిమాలో రకుల్.. అజయ్‌కు కో పైలట్ పాత్రలో నటిస్తుందని సమాచారం.
Published by:
Suresh Rachamalla
First published:
November 30, 2020, 11:06 AM IST