సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమని ప్రకటించగానే తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు ఉంటాయి. దాదాపు ఆరు నెలల సమయం ఉంది. దీంతో అన్ని పార్టీలు తమ తమ బలాబలాలను విశ్లేషించుకుంటున్నారు. ఒక వైపు తలైవా రజినీకాంత్ డిసెంబర్ 31న తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్ చేస్తానని ఆయన తెలియజేసిన సంగతి తెలిసిందే. అందుకు తగిన విధంగా ప్రణాళికలు వేసుకుని లోలోపల ఎన్నికలకు సంబంధించిన పనులను సైలెంట్‌గా పూర్తి కానిచ్చేస్తున్నాడు. మరో వైపు ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమా అణ్ణాతే షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీ బిజీగాఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.
కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు రజినీకాంత్ తన పార్టీ పేరుని, గుర్తుని ఖరారు చేయడమే కాదు. రిజిష్ట్రేషన్ పనులను కూడా పూర్తి చేయించాడట. తలైవా తన పార్టీ పేరుని ‘మక్కల్ సేవై కట్చి(ప్రజా సేవ పార్టీ అని అర్థం)’ అని, పార్టీ గుర్తుగా ‘ఆటో రిక్షా’ని రిజిష్టర్ చేయించారట. అంతకు ముందు రజినీ పార్టీ పేరుని మక్కల్ సేవ కజగం, గుర్తుగా బాబా సినిమాలో చూపించిన సింబల్‌ను అడిగినట్లు వార్తలు కూడా వినిపించాయి.మరో రెండు వారాలు ఆగితే పార్టీ పేరు, గుర్తుపై అధికారిక ప్రకటన వెలువడం పక్కా.
సాధారణంగా రాజకీయాలకు, సినీ రంగానికి దగ్గర సంబంధాలుంటాయని అంటుంటారు. కానీ.. తమిళనాడులో ఈ బంధం మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎన్నికల సమయంలో ఆ బంధం బయటపడుతుంటుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలకు భిన్నంగా తాను ఆధ్యాత్మిక రాజకీయాలకు పెద్ద పీట వేస్తానని రజినీకాంత్ ఇది వరకు తెలియజేసిన సంగతి తెలిసిందే. చానాళ్లుగా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. తాను రాజకీయాల్లోకి వస్తానని రజినీకాంత్ చెబుతూనే ఉన్నాడు కానీ.. ఎప్పుడనే విషయాన్ని మాత్రం తలైవా చెప్పనేలేదు. ఒకానొక సందర్భంలో రజినీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉండబోదని.. అందుకు అనుకున్నంత సమయం కూడా లేదని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్‌గా తన అభిమాన సంఘ నాయకులతో రజినీకాంత్ ప్రత్యేకంగా బేటీ అయ్యారు. వారితో చర్చల అనంతరం రజినీకాంత్ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటనను వెలువరిచారు. ఇప్పటికే ఎన్నికల బరిలో కమల్‌హాసన్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమిళనాడులో వచ్చ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపిస్తారేమో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajnikanth, Tamil nadu Politics