Rajinikanth: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు గత పాతికేళ్లుగా రాజకీయాల్లో వస్తా వస్తా అంటూ ఊరిస్తూ వచ్చిన సూపర్ స్టార్ రజీనీకాంత్.. డిసెంబర్ 3న కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు డిసెంబర్ 31న అర్ధరాత్రి ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు జనవరిలో కొత్త పార్టీ ప్రకటించడంతో పాటు పార్టీ జెండాతో పాటు ఎజెండాను వెల్లడించనున్నారు. ఇక ఎజెండా విషయానికొస్తే.. తాను తమిళనాడులో ద్రవిడ పార్టీలకు భిన్నంగా ఆధ్యాత్మిక రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రజినీకాంత్ అభిమానులకు సంబంధించిన మక్కల్ మండ్రం పార్టీ విధి విధానాలను రూప కల్పన చేసే పనిలో పడ్డాయి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత రజినీకాంత్ బెంగుళూరులోని తన సోదరుడు సత్యనారాయణ రావు ఇంటికి వెళ్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... రజినీకాంత్.. శివ దర్శకత్వంలో ‘అణ్ణాత్తే’ సినిమా చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ అన్ని సినిమాల్లాగే వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ 15న తిరిగి మొదలు పెట్టనున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఆగష్టులో 14న ఈ సినిమా షూటింగ్ కోసం రజినీకాంత్ రామెజీ ఫిల్మ్ సిటికీ వచ్చినా.. కరోనా భయంతో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. కరోనా సోకకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినా రజినీకాంత్ మాత్రం ధైర్యం చేయలేదు. దీంతో శివ.. రజినీకాంత్ లేకుండా వచ్చే సీన్స్‌ను పిక్చరైజ్ చేసారు. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఓ షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ఇక తమిళనాడుకు వచ్చే యేడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన కుష్బూ, మీనా నటిస్తున్నారు. కీర్తి సురేష్ రజినీకాంత్ కూతురు పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగులో ‘అన్నయ్య’ లేదా ‘పెద్దన్నయ్య’ పేర్లు పరిశీలిస్తున్నారు. చివరకు ఏ పేరు పెడతారనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Rajinikanth, Tollywood