Rajanikanth Political Entry: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంగా సమాధానం లేని ప్రశ్న ఇది. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు మొన్న ఆ మధ్య హడావుడి చేసిన రజనీకాంత్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రజనీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటుపై మౌనం వీడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా తలైవా అడుగులు వేయకపోవడం ఆయన ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? పార్టీ విషయంలో ఇంకా ఆలస్యం చేయొద్దంటూ రజనీకాంత్ వీరాభిమానుల్లో ఒకరైన రాఘవ లారెన్స్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ చేసిన ఓ ప్రకటనలో ఆయన ఫ్యాన్స్‌ను మరింత గందరగోళంలోకి నెట్టేసింది.
రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టాలని...మార్పు కోసం పార్టీ పెడుతున్న తలైవాకు రాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతూ రజనీ మక్కల్ మండ్రం(రజనీ అభిమానుల సంఘం)కు చెందిన కొందరు తమిళనాడులో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో మార్పులు రావాలంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి? అందుకే పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ముగియడంతో తాము ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.
అయితే పోస్టర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దంటూ రజనీ మక్కల్ మండ్రం ప్రధాన కార్యాలయం నుంచి వారికి ఆదేశాలు వెళ్లాయి. ఈ ఆదేశాలు వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. దీంతో తలైవా పొలిటికల్ ఎంట్రీపై ఆయన ఫ్యాన్స్ మరింత గందరగోళానికి గురవుతున్నారు. పోస్టర్లను ఏర్పాటు చేయొద్దని సూచిస్తూ తన ప్యాన్స్‌కు ఆదేశాలు పంపడంతో రాజకీయ పార్టీ విషయంలో రజనీకాంత్ వెనక్కి తగ్గుతున్నారన్న ప్రచారం మొదలయ్యింది.
ప్రస్తుతం రజనీకాంత్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఆయన సినిమా షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుంటే ఫిబ్రవరి మాసం వరకు ఆయన పార్టీని ప్రకటించే అవకాశం లేదు. ఏప్రిల్- మే మాసంలో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి మాసంలో పార్టీని ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఆలస్యం అమృతం విషమన్న నానుడి ఉండనే ఉందని గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో తన ఫ్యాన్స్‌కు రజనీకాంత్ ఓ క్లారిటీ ఇస్తే మంచిదని రాజకీయ పండితులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajnikanth, Tamilnadu