హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth: ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్.. అభిమానులు ఫుల్ ఖుషీ..

Rajinikanth: ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్.. అభిమానులు ఫుల్ ఖుషీ..

రజినీకాంత్ (Rajinikanth)

రజినీకాంత్ (Rajinikanth)

Rajinikanth Health: డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా ఆయనలో లేవు. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో రజినీకాంత్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రెండు రోజుల పాటు చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జి అయ్యారు.

ఇంకా చదవండి ...

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జి అయ్యారు. ఆరోగ్యం కుదుటపడడంతో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో బీపీని నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఒత్తిడికి గురికాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని రజినీకి వైద్యులు సూచించారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు. చెన్నైలోని తన నివాసంలోనే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు సూపర్ స్టార్. రజినీ కోలుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.


శుక్రవారం ఉదయం హైబీపీతో హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో రజినీకాంత్ అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. బీపీలో హెచ్చు తగ్గులు ఉండడంతో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ట్రీట్‌మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత పలు పరీక్షలు చేశారు. టెస్ట్ రిపోర్టుల్లో ఎలాంటి ఆందోళనకర అంశాలు లేవని వైద్యులు తెలిపారు. రాత్రంతా బీపీని మానిటర్ చేశారు. ఇవాళ ఉదయం బీపీ అదుపులోకి రావడంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

కాగా, రజినీకాంత్ గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు. ఐతే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌‌‌కు వెళ్లారు. డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా ఆయనలో లేవు. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో రజినీకాంత్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రెండు రోజుల పాటు చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జి అయ్యారు.

రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ మాత్రమే.. భారత సినీ పరిశ్రమను షేక్ చేసిన విషయం తెలిసిందే. హైబీపీతో జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యంపై అభిమానులు, తారలు టెన్షన్ పడ్డారు. తమ అభిమాన నటుడికి ఏమీ కాకూడదని.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు. రజినీకాంత్ క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ పోస్ట్ చేశారు. సాధారణ అభిమానులతో పాటు సిీన తారలు, క్రీడా ప్రముఖులు కోసం రజినీ ఆరోగ్యం కోసం ప్రార్థించారు. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరోవైపు తాను రాజకీయాల్లో వస్తానని గతంలోనే చెప్పిన రజినీకాంత్.. డిసెంబరు 3న కీలక ప్రకటన చేశారు. జనవరిలో కొత్త పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను డిసెంబరు 31న వెల్లడిస్తానని చెప్పారు. ఐతే హైబీపీతో బాధపడిన రజినీకాంత్‌కు ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని అపోలో డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 31న కొత్త పార్టీపై రజినీకాంత్ ప్రకటన చేస్తారా? లేదంటే అనారోగ్యం కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమవుతారా? అన్నది తెలియాల్సి ఉంది. డాక్టర్లు చెప్పినట్లుగానే విశ్రాంతి తీసుకుంటే కొత్త పార్టీ ప్రకటన వాయిదా పడే అవకాశముంది.

First published:

Tags: Hyderabad, Rajinikanth, Tollywood

ఉత్తమ కథలు