రాజేంద్ర ప్రసాద్.. నవ్వుల పండించడంలో ఆయనకు ఎదురలేదు. నట కిరీటిగా పేరుతెచ్చుకున్న రాజేంద్రుడు.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఆయన కేవలం నవ్వులు మాత్రమే.. ఒక్కోసారి ఏడిపించేస్తాడు కూడా. మహేష్ శ్రీమంతుడులో ఓ సాధారణ రైతుగా ఎంతగా ఒదిగాడో.. ఊరు కోసం, ఊరి జనాల బాగు కోసం పాటుపడే పాత్రలో అదరగొడుతూ కన్నీరు పెట్టించాడు. ఇదంతా ఇప్పుడెందుకంటే ఈరోజు ఆయన పుట్టిన రోజు. రాజేంద్రప్రసాద్ 1956 జూలై 19వ తారీఖున.. గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబలకు కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించాడు.. ఆయన పూర్తి పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్.
ఇంజనీరింగ్ చదివిన రాజేంద్ర ప్రసాద్.. సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాస్ బాట పట్టాడు. సినిమాలే తన గమ్యం అని తెలుసుకుని.. అవకాశాల కోసం వెతుక్కుంటూ ఎన్నో కష్టాలను భరించాడు. మొదట్లో చిన్న చిన్న వేషాలతో అలరించిన రాజేంద్ర ప్రసాద్‌కు తొలి సినిమా 1977లో బాపు దర్శకత్వంలో స్నేహం. ఆ తర్వాత ఆయన వంశీ దర్శకత్వంలో 1982లో వచ్చిన మంచుపల్లకి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్.. పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో నటించి భిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు.
ఇక హాస్యామే ప్రధానంశంగా ఆయన చేసిన సినిమాలు చాలా మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా దర్శకుడు జంధ్యాల డైరెక్షన్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసిన 'రెండురెళ్ల ఆరు', 'అహనా పెళ్లంట' వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. వంశీ లేడిస్ టైలర్, SV కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయలోడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు.
ఇ.వి.వి సత్యనారాయణ తీసిన సినిమాలో అప్పుల అప్పారావులో ఆయన పండించిన హాస్యం అందర్ని కడుపుబ్బ నవ్వించింది. ఇక 2009లో క్విక్‌గన్‌మురుగన్ అనే ఆంగ్ల చిత్రం ద్వారా ఆయన అంతర్జాతీయంగా కీర్తిని సాధించారు. ఎర్రమందారం (1991), ఆ నలుగురు (2004) సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు.
ఇక ఆయన తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో నటించి.. తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. పుట్టిన రోజు సందర్భంగా న్యూస్18 ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయుర్ ఆరోగ్యాలతో ఆయన ఇంకా ఎన్నో మంచి చిత్రాలలో నటించాలనీ.. కోరుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajendra Prasad, Tollywood news